chidambaram: ప్రధాని ప్రసంగంపై నిన్ననే ఎందుకు స్పందించలేదంటే...: చిదంబరం ఆసక్తికర ట్వీట్
- హెడ్డింగ్ మాత్రమే కనిపించింది
- మిగతా అంతా ఖాళీగానే ఉంది
- దీంతో తన మైండ్ బ్లాంక్ అయిందన్న చిదంబరం
నిన్నటి తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఓ వార్తకు సంబంధించిన హెడ్డింగ్ ను మాత్రమే చెప్పారని, దానికింద మాత్రం ఖాళీగా కనిపించేలా చేశారని ఆర్థిక శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం విమర్శలు గుప్పించారు. జీడీపీలో 10 శాతానికి సమానమైన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీని సిద్ధం చేస్తున్నామని మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
"ఓ హెడ్ లైన్ పెట్టి, పేజీని ఖాళీగా వదిలేసిన మోదీ, దాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి చేస్తారని చెప్పారు. నేను దాని కోసమే చూస్తున్నాను" అని వ్యాఖ్యానించారు. ఈ విషయమై తాను నిన్ననే ఎందుకు స్పందించలేదన్న విషయాన్ని కూడా ఆయన వివరించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ మెసేజ్ ని పెట్టారు.
"నిన్న ప్రధాని ఓ హెడ్ లైన్ పెట్టి, పేజీని ఖాళీగా ఉంచారు. దీంతో సహజంగానే నేనెలా స్పందించాలో తెలియలేదు. ఇవాళ ఆ ఖాళీని ఆర్థిక మంత్రి పూరిస్తారని వేచి చూస్తున్నాను. ఆర్థిక వ్యవస్థ కోసం ప్రభుత్వం వెచ్చించే ప్రతి రూపాయినీ మేము జాగ్రత్తగా గమనిస్తాం" అని వ్యాఖ్యానించారు.
'ఈ డబ్బు ప్రతి ఒక్కరికీ ఎలా సాయపడుతుందో గమనిస్తూ ఉంటాము. ముఖ్యంగా పేదలకు ఎలా ఉపకరిస్తుందో పరిశీలిస్తాం. దేశంలోని 13 కోట్ల మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. వారికి నిజమైన డబ్బు ఏ మేరకు అందుతుందో చూడాలి" అని కూడా అన్నారు.