Pakistan: ప్రాణాధార డ్రగ్స్ మాటున భారత్ నుంచి 450 ఔషధాల దిగుమతి.. దర్యాప్తునకు ఆదేశించిన ఇమ్రాన్ ఖాన్
- గతేడాది ఆగస్టు 9న భారత్‌తో వాణిజ్య సంబంధాలు తెంచుకున్న పాక్
- విటమిన్స్ వంటి 450 రకాల డ్రగ్స్‌ను దిగుమతి చేసుకుంటున్న పాక్ ఫార్మా కంపెనీలు
- నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ దుమ్మెత్తి పోస్తున్న ప్రతిపక్షాలు
ప్రాణాలు నిలబెట్టే డ్రగ్స్ మాటున విటమిన్ ట్యాబ్లెట్ల వంటి 450 రకాల ఔషధాలు భారత్ నుంచి దేశంలోకి అక్రమంగా దిగుమతి అవుతున్నాయన్న వార్తలపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ఈ కుంభకోణంపై విచారణకు ఆదేశించారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని గతేడాది ఆగస్టు 5న భారత ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఆగస్టు 9 నుంచి భారత్‌తో వాణిజ్యపరమైన సంబంధాలను పాకిస్థాన్ రద్దు చేసుకుంది.
ప్రభుత్వ నిర్ణయంతో దేశంలోని ఫార్మాస్యూటికల్ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోబోతోందని, ముఖ్యమైన డ్రగ్స్‌కు కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమైంది. దీంతో స్పందించిన ప్రభుత్వం నిబంధనలు సడలించింది. ప్రాణాధార డ్రగ్స్, వాటి ముడి ఉత్పత్తుల దిగుమతికి అనుమతి ఇచ్చింది.
అయితే, ప్రభుత్వం ఇచ్చిన ఈ సడలింపు దుర్వినియోగం అవుతోందంటూ ప్రతిపక్షాలు, మీడియా దుమ్మెత్తిపోస్తుండడంతో ఇమ్రాన్ దర్యాప్తునకు ఆదేశించారు. భారత్ నుంచి దిగుమతి అవుతున్న 450 ఔషధాలపై దర్యాప్తు జరపాలంటూ ఆదేశాలు జారీ చేశారు.