Somu Veerraju: భూముల కొనుగోలులో వందల కోట్ల కుంభకోణం జరిగింది.. జగన్ స్పందించకపోతే ఉద్యమం చేస్తాం: సోము వీర్రాజు
- ఆవ భూములను పరిశీలించిన విపక్ష నేతలు
- ముంపు భూములను కొన్నారన్న సోము వీర్రాజు
- కొనుగోలును రద్దు చేయాలని డిమాండ్
పేదలకు ఇళ్ల కోసం ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న భూముల వ్యవహారం పలుచోట్ల విమర్శలకు గురవుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలోని కాపవరం, బూరుగుపూడిలో ప్రభుత్వం కొనుగోలు చేసిన ఆవ భూములను బీజేపీ, టీడీపీ జనసేన, కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, పేదల ఇళ్ల కోసం ముంపు భూములను కొనుగోలు చేశారని మండిపడ్డారు.
ఎకరం రూ. 20 లక్షలు పలికే ఈ భూముల ధరను రూ. 45 లక్షలకు పెంచి కొనుగోలు చేశారని... మొత్తం 586 ఎకరాల భూమిని కొన్నారని... ఈ కొనుగోళ్లలో వందల కోట్ల స్కామ్ జరిగిందని సోము వీర్రాజు ఆరోపించారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి జగన్ కలగజేసుకోవాలని... భూముల కొనుగోలును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జగన్ స్పందించకపోతే అన్ని పార్టీలు, రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.