Tenth Class: ఏపీలో జూలై మొదటి వారంలో పదో తరగతి పరీక్షలు: మంత్రి ఆదిమూలపు వెల్లడి
- లాక్ డౌన్ తో వాయిదా పడిన 10వ తరగతి పరీక్షలు
- త్వరలోనే షెడ్యూల్ విడుదల చేస్తామన్న మంత్రి
- మే నెలలో పరీక్షలు ఉంటాయన్నది పుకారు మాత్రమేనని వెల్లడి
కరోనా కారణంగా ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే పూర్తవ్వాల్సి ఉన్నా, లాక్ డౌన్ విధించడంతో పబ్లిక్ పరీక్షలు నిలిచిపోయాయి. ఈ అంశంపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు. జూలై 1 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నామని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేసి, షెడ్యూల్ విడుదల చేస్తామని అన్నారు.
కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని, అన్ని రకాల నివారణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యార్థుల మధ్య నిర్దేశిత భౌతికదూరం ఉండేలా చూస్తామని, మాస్కులు ధరించి పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేస్తామని మంత్రి చెప్పారు. మామూలు పరిస్థితుల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు 2,900 పరీక్ష కేంద్రాలు అవసరం అవుతాయని, కానీ ఇప్పుడు విద్యార్థులు భౌతికదూరం పాటించాల్సి రావడంతో మరిన్ని సెంటర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అయితే, లాక్ డౌన్ ముగిసిన వెంటనే మే నెలలోనే పరీక్షలు ఉంటాయని ప్రచారం జరుగుతోందని, అది నిజం కాదని స్పష్టం చేశారు.