Writ petetion: ఏపీలో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో రిట్ పిటిషన్
- ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 75 శాతం రిజర్వేషన్లు
- దీనిని సవాల్ చేస్తూ విజయవాడ న్యాయవాది రిట్ దాఖలు
- పిటిషనర్ తరఫున వాదించిన సుప్రీంకోర్టు న్యాయవాది జి.ఆదినారాయణ
ఏపీలో స్థానికులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో 75 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. విజయవాడకు చెందిన న్యాయవాది సి.హెచ్ వరలక్ష్మి ఈ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది జి.ఆదినారాయణ తన వాదనలు వినిపించారు. ఈ విషయమై పారిశ్రామికవేత్తలే పిటిషన్ వేయాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాది సుమంత్ రెడ్డి వాదించారు.
దీనిపై తమ వాదనలు వినిపించేందుకు, కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయం కావాలని న్యాయస్థానాన్ని సుమంత్ రెడ్డి కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ అంశంపై విచారణలో ప్రజాప్రయోజనం ఉందని ధర్మాసనం భావించింది. రాజ్యాంగ పరిధిలోకి లోబడే ఈ నిర్ణయం తీసుకున్నారా? అని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.