KCR: ఆగస్టు లేదా సెప్టెంబర్ లో... తెలంగాణ నుంచే ప్రపంచానికి కరోనా వాక్సిన్: కేసీఆర్
- ఇటీవల కేసీఆర్ తో సమావేశమైన మహిమా దాట్ల, వరప్రసాద్ రెడ్డి
- మూడు నెలల్లో వాక్సిన్ వస్తుందన్న జీనోమ్ వ్యాలీ కంపెనీలు
- ప్రపంచానికే గర్వకారణం అవుతామన్న కేసీఆర్
తెలంగాణలోని ప్రతిష్ఠాత్మక జీనోమ్ వ్యాలీలోని ఔషధ సంస్థలు, కరోనాకు ఔషధాన్ని తెచ్చేందుకు శ్రమిస్తున్నాయని, వారి కృషి ఫలిస్తే, ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో కరోనా వాక్సిన్ తెలంగాణ నుంచే వస్తుందని, దేశంతో పాటు ప్రపంచానికి కూడా మన తెలంగాణ గర్వకారణంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు.
రాష్ట్రానికి చెందిన 'బయోలాజికల్ ఈ' నుంచి మహిమా దాట్ల, 'శాంతా బయోటెక్' ఎండీ వర ప్రసాద రెడ్డి ఇటీవల తనతో మాట్లాడారని, వారంతా చాలా సీరియస్ గా వాక్సిన్ కోసం పరిశోధనలు సాగిస్తున్నారని అన్నారు. ఆగస్టుకే వాక్సిన్ వచ్చే అవకాశం ఉందని వరప్రసాద రెడ్డి తనతో చెప్పారని, అంతా సవ్యంగా జరిగితే, సెప్టెంబర్ లో మరో వాక్సిన్ వస్తుందని, తాము 100 శాతం సక్సెస్ అవుతామన్న నమ్మకాన్ని ఆయన వెలిబుచ్చారని కేసీఆర్ తెలియజేశారు. అదే జరిగితే, మన రాష్ట్రం నుంచి, జీనోమ్ వ్యాలీ నుంచి వాక్సిన్ రావడం చాలా గ్రేట్ అని అభివర్ణించారు.