Gold: బంగారం ధరలపై.. ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ మినహాయింపుల ఎఫెక్ట్!
- 0.71 శాతం తగ్గిన జూన్ ఫ్యూచర్స్ ధర
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
- రూ. 45,480కి పది గ్రాముల ధర
ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ నుంచి మినహాయింపులు ప్రకటిస్తూ ఉండటం, స్టాక్ మార్కెట్ల లాభాలు, బంగారం ధరలను తగ్గించాయి. ఇండియాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బెంచ్ మార్క్ సూచికలు సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లో నడుస్తున్న వేళ, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో బంగారం ధర కీలక మద్దతు స్థాయికి దిగువకు చేరింది.
జూన్ డెలివరీ ఫ్యూచర్స్ ధర 0.71 శాతం పడిపోయింది. ఓ దశలో రూ. 45,527 వరకూ ఉన్న ధర, ఆపై రూ. 45,480కి తగ్గింది. ఇదే సమయంలో కిలో వెండి ధర రూ. 41,244 నుంచి రూ. 41,143కు చేరింది. ఇక హైదరాబాద్ మార్కెట్ విషయానికి వస్తే, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 43,760గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 46,560 వద్ద కొనసాగుతున్నాయి.
ఇక అంతర్జాతీయ మార్కెట్ల విషయానికి వస్తే, ఔన్సు బంగారం ధర 0.5 శాతం పడిపోయి 1,705.50 డాలర్లకు చేరింది. చైనా, అమెరికాల మధ్య కొనసాగుతున్న ట్రేడ్ వార్ భయాలు తొలగితే, బంగారం ధర మరింతగా దిగివస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదిలావుండగా, ఈ ఉదయం 12.10 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక, క్రితం ముగింపుతో పోలిస్తే 115 పాయింట్లు పెరిగి 31,830 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిన్నటి భారీ నష్టాల తరువాత ఇన్వెస్టర్ల షార్ట్ కవరింగ్ కు ప్రయత్నించినందునే మార్కెట్లు లాభాల్లో ఉన్నాయని ట్రేడ్ పండితులు అభివర్ణించారు. ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ, 36 పాయింట్లు పెరిగి 9,330 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ-50లోని 25 కంపెనీలు లాభాల్లో, 25 కంపెనీలు నష్టాల్లో నడుస్తున్నాయి.