MM Narawane: పాకిస్థాన్ కు ఏ అంశంలో ఎలా బుద్ధి చెప్పాలో అలాగే చెబుతాం: ఆర్మీ చీఫ్ నరవాణే

Indian Army Chief MM Narawane warns Pakistan
  • నిన్న హంద్వారాలో ఐదుగురు భద్రతా సిబ్బంది మృతి
  • పాకిస్థాన్ కు హెచ్చరికలు చేసిన జనరల్ నరవాణే
  • పాక్ ది హ్రస్వదృష్టి అంటూ విమర్శలు
జమ్మూకశ్మీర్ లోని హంద్వారాలో నిన్న జరిగిన కాల్పుల్లో ఐదుగురు భారత భద్రతా సిబ్బంది అమరులైన సంగతి తెలిసిందే. దీనిపై ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే తీవ్రస్థాయిలో స్పందించారు. పాకిస్థాన్ ఇప్పటికీ జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదాన్ని ఎగదోయాలనే పరిమిత అజెండాను కొనసాగిస్తూనే ఉందని మండిపడ్డారు. ఓవైపు సొంత ప్రజలు కరోనాతో అల్లాడుతుంటే, పొరుగుదేశంలో ఉగ్రవాద చర్యలకు ఊతమిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ హ్రస్వదృష్టికి ఇదే నిదర్శనం అని విమర్శించారు.

సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఉల్లంఘనలకు, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే చర్యలకు అన్నింటికీ అంశాల వారీగా జవాబు చెబుతామని హెచ్చరించారు. హంద్వారా ఘటనలో మృతి చెందిన భద్రతా సిబ్బంది పట్ల భారత్ గర్విస్తోందని, పాక్ కుతంత్రాలకు భారత సైన్యం తగిన విధంగా స్పందిస్తుందని జనరల్ నరవాణే పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో శాంతి నెలకొల్పాల్సిన బాధ్యత పాక్ పైనే ఉందని స్పష్టం చేశారు. కరోనాతో బాధపడుతున్న సొంత ప్రజలకు పాక్ తక్కువ ప్రాధాన్యత ఇస్తోందని, అక్కడ దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు.
MM Narawane
Army Chief
India
Pakistan
Handwara
Terrorism
Corona Virus

More Telugu News