Andhra Pradesh: ఏపీలో భారీగా పెరిగిన మద్యం ధరలు... కొత్త ధరలు ఇలా!
- రాష్ట్రానికి ఏటా రూ. 4 వేల కోట్ల అదనపు ఆదాయం
- రూ. 20 పెరిగిన లైట్ బీర్ ధర
- క్వార్టర్ బాటిల్ పై రూ. 20 పెంపు
నేటి నుంచి గ్రీన్ జోన్లలో అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతించాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 నుంచి సాయంత్రం 7 గంటల మధ్య కంటైన్ మెంట్ జోన్ల బయట మాత్రమే మద్యం విక్రయించుకోవచ్చని స్పష్టం చేసిన ప్రభుత్వం, మద్యం ఉత్పత్తుల ధరలను భారీగా పెంచింది. దీంతో రాష్ట్రానికి ఏటా రూ. 4 వేల కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా.
మద్యం కొనుగోలును తగ్గించడం కోసమే ధరలను పెంచామని అంటున్న ఏపీ సర్కారు, లైట్ బీర్ ధరను రూ. 20, స్ట్రాంగ్ బీర్ ధరను రూ. 10 మేరకు పెంచింది. క్వార్టర్ బాటిల్ పై రూ. 20, హాఫ్ బాటిల్ పై రూ. 40, ఫుల్ బాటిల్ పై రూ. 80, ఫారిన్ లిక్కర్ బాటిల్ పై రూ. 150 చొప్పున ధరలను పెంచారు. ఇప్పుడు స్టాక్ ఉన్న మద్యాన్ని పాత ధరలకే విక్రయించాలని, కొత్త ఎమ్మార్పీ ధరలు ముద్రించినవి మార్కెట్లోకి వచ్చిన తరువాత మాత్రమే కొత్త ధరలు అమలులోకి వస్తాయని అధికారులు స్పష్టం చేశారు.