Sourav Ganguly: ప్రమాదకరమైన పిచ్ పై టెస్టు మ్యాచ్ లాంటిది ఈ కరోనా: గంగూలీ
- కరోనాను టెస్టు మ్యాచ్ తో పోల్చిన గంగూలీ
- బ్యాట్స్ మెన్ పరుగులు తీస్తూనే వికెట్ కాపాడుకోవాలంటూ వ్యాఖ్యలు
- చిన్న తప్పు చేసినా అవుటవడం ఖాయమని వెల్లడి
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ తనదైన శైలిలో అభివర్ణించాడు. కరోనా సంక్షోభాన్ని చూస్తుంటే ప్రమాదకరమైన పిచ్ పై టెస్టు మ్యాచ్ ఆడుతున్నట్టుగా ఉందని అన్నాడు. "బంతి దూసుకువస్తోంది, స్పిన్ కూడా తిరుగుతోంది. బ్యాట్స్ మెన్ చిన్నతప్పు చేసినా అవుట్ కావడం ఖాయం అనే విధంగా ఉంది. ఈ మ్యాచ్ గెలవాలంటే బ్యాట్స్ మెన్ పరుగులు చేయాల్సిందే, వికెట్ ను కాపాడుకోవాల్సిందే" అని వివరించాడు.
కరోనా కారణంగా ఉత్పన్నమవుతున్న పరిణామాలు గమనిస్తుంటే ఎంతో విచారం కలుగుతోందని పేర్కొన్నాడు. ఫీవర్ నెట్వర్క్ నిర్వహిస్తున్న 100 అవర్స్ 100 స్టార్స్ అనే కార్యక్రమంలో భాగంగా గంగూలీ ఈ వ్యాఖ్యలు చేశాడు. బయట పరిస్థితులు చూస్తుంటే ఎంతో క్లిష్టంగా ఉన్నా, సమష్టిగా విజయం సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశాడు. ఈ వైరస్ భూతాన్ని ఎలా నిలువరించాలన్నదే విచారం కలిగిస్తోందని పేర్కొన్నాడు.