Kim Jong Un: కిమ్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలకు చెక్.. ప్రజల ముందుకు ఉత్తర కొరియా అధ్యక్షుడు!
- ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కిమ్
- కిమ్‌తో పాటు ఆయన సోదరి కూడా..
- ఆ దేశ అధికారిక మీడియాలో తప్ప మరెక్కడా కనిపించని వార్త
ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం విషయంలో వస్తున్న వార్తలకు చెక్ పడింది. ఆయన భేషుగ్గా ఉన్నారని, ప్రజల ముందుకు వచ్చారని ఆ దేశ అధికారిక మీడియా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) వెల్లడించింది. ఉత్తర ప్యాంగ్యాంగ్ ప్రాంతంలోని ఓ ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో కిమ్.. తన సోదరి కిమ్ యో జోంగ్‌తో కలిసి పాల్గొన్నారని పేర్కొంది. ఈ సందర్భంగా పలువురు సీనియర్ అధికారులు కూడా ఆయన వెంట ఉన్నారని తెలిపింది.
కిమ్ రిబ్బన్ కట్ చేస్తున్న ఫొటోను కూడా విడుదల చేసింది. అంతేకాదు, కిమ్ కనిపించగానే అక్కడి ప్రజలందరూ ఆశ్చర్యపోయారని, ‘హుర్రే’ అంటూ నినాదాలు చేశారని పేర్కొంది. అయితే, ఈ వార్త ఒక్క ఆ దేశ అధికారిక మీడియాలో రావడం తప్ప, మరే అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీలు దీనిని ధ్రువీకరించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
కిమ్ గత నెల 11 నుంచి ప్రజలకు కనిపించకుండా పోయారు. గుండెకు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. అంతేకాదు, ఆయనకు చికిత్స చేసేందుకు చైనా నుంచి ఓ వైద్య బృందం కూడా వెళ్లింది. కిమ్ అనారోగ్యంపై వస్తున్న వార్తలను అమెరికా, దక్షిణ కొరియాలు ఇది వరకే ఖండించాయి.