Migrants: వలస కూలీలు, కార్మికులు ఒక జిల్లా నుంచి మరో జిల్లా వెళ్లేందుకు ఏపీ సర్కారు గ్రీన్ సిగ్నల్
- లాక్ డౌన్ తో చిక్కుకుపోయిన వలస కూలీలు, కార్మికులు
- ప్రభుత్వ ఖర్చులతో పంపిస్తామన్న కృష్ణబాబు
- ముందు వారికి కరోనా టెస్టులు నిర్వహిస్తామని స్పష్టీకరణ
ఏపీలో కరోనా పరిస్థితులపై ఏర్పాటు చేసిన కొవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ కృష్ణబాబు విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలను వెల్లడించారు. రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు చేసిన తర్వాత అనేక ప్రాంతాల్లో వలస కూలీలు, కార్మికులు చిక్కుకుపోయారని, ఇప్పుడు వారు ఒక జిల్లా నుంచి మరో జిల్లా వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు.
అయితే, వారికి కరోనా టెస్టులు నిర్వహించిన తర్వాతే స్వస్థలాలకు పంపిస్తామని స్పష్టం చేశారు. వలస కూలీలు, కార్మికులు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఏపీ ప్రజలను కూడా తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఎవరైనా చిక్కుకుపోతే 0866-2424680 నంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించాలని తెలిపారు. apcovid19controlroom@gmail.com ఈమెయిల్ ఐడీ ద్వారా కూడా సంప్రదించవచ్చని వెల్లడించారు.