MSME: ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వ ఆర్థిక ప్రణాళిక

AP Government decides to boost MSME sector

  • మొత్తం రూ.905 కోట్ల బకాయిల చెల్లింపుకు సీఎం నిర్ణయం
  • రెండు విడతల్లో బకాయిల చెల్లింపు
  • రూ.188 కోట్ల మేర విద్యుత్ డిమాండ్ చార్జీల మాఫీ

లాక్ డౌన్ నేపథ్యంలో ఏపీ ఆర్థిక పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదని చెప్పాలి. అయినప్పటికీ, సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు సాయం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్రణాళిక రూపొందించింది. ఎంఎస్ఎంఈల స్థితిగతులపై సీఎం జగన్ ఈ సాయంత్రం అధికారులతో సమీక్ష నిర్వహించారు. లాక్ డౌన్ కారణంగా పారిశ్రామిక రంగానికి వాటిల్లుతున్న నష్టంపై ఆయన చర్చించారు. దీని ప్రభావం నుంచి ఎంఎస్ఎంఈలను కాపాడేందుకు ఆర్థిక భరోసా ప్రణాళిక ప్రకటించాలని నిర్ణయించారు.

2014-15 నుంచి ఎంఎస్ఎంఈలకు పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం రూ.905 కోట్ల బకాయిలు చెల్లించాలని, మే నెలలో సగం, జూన్ నెలలో సగం చొప్పున రెండు విడతల్లో చెల్లించేలా ప్రణాళిక రూపొందించారు. అంతేకాకుండా, ఎంఎస్ఎంఈలకు సంబంధించిన రూ.188 కోట్ల విద్యుత్ డిమాండ్ చార్జీల మాఫీకి కూడా సీఎం ఆమోదం తెలిపారు. ఈ చార్జీల మాఫీ ఏప్రిల్, మే, జూన్ మాసాలకు వర్తింపజేయాలని నిర్ణయించారు.

దాంతోపాటే, ఎంఎస్ఎంఈలకు తక్కువ వడ్డీతో రూ.200 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు కూడా వచ్చాక మరిన్ని చర్యలు ఉంటాయని సీఎం ఈ సందర్భంగా తెలిపారు. టెక్స్ టైల్ సహా ఇతర పరిశ్రమలను కూడా ఆదుకుంటామని, ఆ దిశగా మరిన్ని చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News