Narasaraopet: కొంపముంచిన వన్ బై టూ చాయ్... నరసరావుపేటలో కరోనా కల్లోలం!
- కరోనా ధాటికి నరసరావుపేట అతలాకుతలం
- మర్కజ్ వెళ్లొచ్చిన వ్యక్తితో కలిసి టీ తాగిన కేబుల్ ఆపరేటర్
- చికిత్స పొందుతూ కేబుల్ ఆపరేటర్ మృతి
- ఇద్దరి కారణంగానే కేసుల సంఖ్య పెరిగినట్టు గుర్తించిన అధికారులు
కరోనా రక్కసి గుంటూరు జిల్లాను అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా నరసరావుపేటలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇక్కడ వందకు పైగా కేసులు బయటపడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీనికంతటికీ కారణంగా ఓ వ్యక్తి వన్ బై టూ చాయ్ తాగడమేనని తెలుస్తోంది. ఇటీవలే ఓ వ్యక్తి ఢిల్లీలోని మర్కజ్ కు వెళ్లి రాగా, అతడితో కలిసి ఓ కేబుల్ ఆపరేటర్ టీ తాగాడు. అక్కడి నుంచే కరోనా వ్యాప్తి తీవ్రమైనట్టు అధికారులు గుర్తించారు.
వరవకట్ట ప్రాంతానికి చెందిన ఆ కేబుల్ ఆపరేటర్ కారణంగా 50 మందికి వ్యాధి సంక్రమించినట్టు తెలుసుకున్నారు. కేబుల్ ఆపరేటర్ గుంటూరులో చికిత్స పొందుతూ మరణించాడు. మరణానంతరం అతడికి కరోనా పాజిటివ్ అని గుర్తించారు.
ఇక, కేబుల్ ఆపరేటర్ ఇంటి సమీపంలో నివసించే హోంగార్డుకు ఈ నెల 14న కరోనా పాజిటివ్ అని తేలగా, నరసరావుపేటలోనే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాంతో ఆ ఆసుపత్రిలో 20 మందికి కరోనా సోకినట్టు తేలింది. నలుగురు వైద్యులు కూడా కరోనా బారినపడినట్టు వెల్లడైంది. మొత్తమ్మీద ఇద్దరు వ్యక్తుల కారణంగానే నరసరావుపేటలో కరోనా తీవ్రరూపం దాల్చినట్టు భావిస్తున్నారు.