Rishi Kapoor: అభిమానులను ఉద్దేశించి రిషి కపూర్ కుటుంబం అధికారిక ప్రకటన!
- ల్యుకేమియాతో పోరాడుతూ ఉదయం 8.45కి కన్నుమూశారు
- అభిమానుల అభిమానం పట్ల ఎంతో సంతోషించేవారు
- లాక్ డౌన్ ఆంక్షలను అందరూ పాటించండి
బాలీవుడ్ అగ్రనటుల్లో ఒకరైన రిషికపూర్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్తతో బాలీవుడ్ షాక్ కు గురైంది. రిషి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. మరోవైపు రిషి మృతికి సంబంధించి ఆయన కుటుంబం అధికారిక ప్రకటన చేసింది.
'మేము ఎంతో ప్రేమించే రిషి కపూర్ ల్యుకేమియాపై రెండేళ్ల పాటు పోరాడి ఈ ఉదయం 8.45కి మృతి చెందారు. ఎంతో ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారు. ఆయన చివరి శ్వాస వరకు తమను ఎంతో ఎంటర్టైన్ చేశారని ఆసుపత్రిలో చికిత్స చేసిన డాక్టర్లు, మెడికల్ స్టాఫ్ చెప్పారు.
రెండు ఖండాల్లో రెండేళ్ల పాటు రిషి చికిత్స పొందారు. చికిత్స సమయంలో కూడా ఆయన ఎంతో సంతోషంగా, సరదాగా ఉన్నారు. తన జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించారు. కుటుంబం, స్నేహితులు, ఆహారం, సినిమాలు వీటి గురించే ఎక్కువగా ఆలోచించేవారు. ఈ రెండేళ్ల కాలంలో ఆయనను చూసేందుకు వచ్చినవారంతా... క్యాన్సర్ ను ఆయన ఎదుర్కొంటున్న తీరును చూసి ఆశ్చర్యపోయారు.
అభిమానులు చూపించే అభిమానం పట్ల ఆయన ఎంతో సంతోషించేవారు. తన మరణం తర్వాత కూడా అభిమానులందరూ చిరునవ్వుతోనే తనను గుర్తుంచుకోవాలని... కంటతడితో కాదనే విషయాన్ని ఆయన కోరుకున్నారు. అభిమానులంతా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఇది చాలా బాధాకరమైన సమయం. కరోనా నేపథ్యంలో ప్రజల కదలికలు, సామూహిక కలయికలపై ఆంక్షలు ఉన్నాయి. చట్టాలను, ప్రభుత్వ ఆదేశాలను అందరూ పాటించాలని కోరుతున్నాం. రిషి చివరి చూపు కోసం ఎవరూ రావద్దు. అందరూ ఇంటి వద్దే ఉండండి' అని రిషి కపూర్ కుటుంబసభ్యులు ట్విట్టర్ ద్వారా కోరారు.