Telangana Grameena Bank: అనర్హుల ఖాతాల్లోకి సొమ్ము.. 3 లక్షల జన్ ధన్ ఖాతాల నుంచి నగదు వెనక్కు తీసుకున్న తెలంగాణ బ్యాంకు!

TGB Taken Back Cash on Jandhan Accounts

  • పీఎంజీకేవైలో భాగంగా 9 లక్షల మందికి డబ్బు
  • సుమారు 4 లక్షల మంది అనర్హులు 
  • పొరపాటున డబ్బు వేశామని వివరణ ఇచ్చిన బ్యాంకు జీఎం

తెలంగాణలో దాదాపు 3 లక్షల జన్ ధన్ ఖాతాల్లో పీఎంజీకేవై పథకంలో భాగంగా జమ చేసిన రూ. 16 కోట్లకు పైగా డబ్బును తెలంగాణ గ్రామీణ బ్యాంకు వెనక్కు తీసుకుంది. లాక్ డౌన్ సమయంలో ప్రజల ఆర్థిక అవసరాలు తీర్చేందుకు మూడు నెలల పాటు నెలకు రూ. 500 చొప్పున జన్ ధన్ ఖాతాల్లో జమ చేస్తామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ఏప్రిల్ తొలి వారంలోనే నగదు జమ అయింది.

ఇందులో భాగంగానే, రాష్ట్రంలోని 473 తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖల్లో ఖాతాలు కలిగివున్న సుమారు 9 లక్షల మందికి డబ్బులు జమ అయ్యాయి. వీరిలో 5,15,260 మంది మాత్రమే అర్హులని, మిగతా వారు అనర్హులని తేల్చిన బ్యాంకు, ఆ డబ్బును తిరిగి తీసేసుకుంది.

ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన బ్యాంకు జనరల్ మేనేజర్ మహేశ్, 1 ఆగస్టు 2014 తరువాత ప్రారంభించిన ఖాతాలు మాత్రమే అర్హమైనవన్న నిబంధనలు ఉన్నాయని వెల్లడించారు. తాము పొరపాటున నగదును జమ చేశామని, వారం తరువాత దాన్ని గుర్తించామని తెలిపారు.

అయితే, అప్పటికే లక్షకు పైగా అనర్హులు, తమ ఖాతాల నుంచి డబ్బును విత్ డ్రా చేసుకున్నారని, వారి నుంచి నగదును తిరిగి రాబట్టేందుకు కూడా ప్రయత్నాలు సాగుతున్నాయని మహేశ్ స్పష్టం చేశారు. అనర్హులుగా తేలి, నగదు నిల్వ ఉన్న ఖాతాల నుంచి మాత్రమే డబ్బును వెనక్కు తీసుకున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News