Kesineni Nani: ఈ కష్టకాలంలో కస్టమర్లకు మద్దతుగా నిలవాలని బ్యాంకులకు చెప్పండి: నిర్మలా సీతారామన్ కు కేశినేని నాని లేఖ
- ఎంఎస్ఎంఈ రంగం కష్టాల్లో ఉందన్న నాని
- మే 1 నాటికి ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల్సి ఉందని వెల్లడి
- నగదు విడుదలకు అనుమతుల ఆలస్యం అవుతోందని వివరణ
టీడీపీ ఎంపీ కేశినేని నాని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. ఈ కష్టకాలంలో బ్యాంకులన్నీ వినియోగదారులకు మద్దతుగా నిలిచేలా ఆదేశాలు ఇవ్వాలని నాని కోరారు. కంపెనీల నుంచి తమ బకాయిలు రావడంలేదని, బ్యాంకింగ్ పరమైన ఇబ్బందులే అందుకు కారణమని తన నియోజకవర్గం నుంచి అనేకమంది ఫిర్యాదులు చేస్తున్నారని వివరించారు.
2019 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త పాన్ విధానాల కారణంగా, విజయవాడ పరిధిలో పెద్దమొత్తంలో నగదు లావాదేవీలకు హైదరాబాద్ నుంచో, ముంబయి నుంచో అనుమతులు రావాల్సి ఉంటోందని తనతో చాలామంది చెప్పారని కేశినేని నాని తెలిపారు. ఇలాంటి లావాదేవీలకు రెండు, మూడు నెలలకు గానీ అనుమతులు రావడంలేదని, డీజీఎం స్థాయిలో నగదు అనుమతుల పరిధిని కూడా రూ.30 కోట్ల నుంచి రూ.3 కోట్లకు కుదించారని తెలిసిందని పేర్కొన్నారు. ఈ కారణంగా డీజీఎం కూడా నిస్సహాయుడిలా మిగిలిపోతున్నారని, ఏప్రిల్ మాసం ముగింపు దశకు వస్తోండగా, సంస్థలు మే 1 నాటికి జీతాలు విడుదల చేయాల్సి ఉందని తెలిపారు.
దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న ఇలాంటి తరుణంలో తక్షణమే చర్యలు చేపట్టడం ద్వారా ఎంఎస్ఎంఈ రంగానికి సాయపడాలని, తద్వారా సదరు రంగంలోని భారీ సంఖ్యలోని ఉద్యోగులకు మేలు జరుగుతుందని కేశినేని నాని కోరారు. ఎస్ బీఐతో పాటు ఇతర బ్యాంకులను కూడా కస్టమర్ల విజ్ఞప్తులకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ ఆదేశించాలని, నిర్దిష్ట కాలవ్యవధిలో సదరు విజ్ఞప్తులను పరిష్కరించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని తన లేఖలో విన్నవించుకున్నారు.
కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ ఎస్ బీఐ, ఇతర బ్యాంకుల కస్టమర్ల నుంచి నేరుగా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని, తద్వారా బ్యాంకులు కస్టమర్లకు తప్పకుండా మద్దతుగా నిలుస్తాయని తెలిపారు. కరోనా విపత్కర సమయంలో ప్రజలు ఇళ్ల వద్దనే ఉండాలంటే ఇలాంటి విధానపరమైన చర్యలు కూడా ఎంతో ఉపయోగపడతాయని, ఇలాంటి సంక్షుభిత సమయంలో ఏ కొద్ది ఆలస్యం కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు దారితీస్తుందని, ఇతర సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ అంశాలన్నీ పరిశీలించి స్థానిక బ్రాంచిలకు కూడా అధికారాలు కల్పించాలని ఎస్ బీఐ సహా ఇతర బ్యాంకుల చీఫ్ లను ఆదేశిస్తారని కోరుకుంటున్నట్టు కేశినేని నాని విజ్ఞప్తి చేశారు.