KCR: రాష్ట్రంలో ‘కరోనా’ తగ్గుముఖం పడుతోంది: తెలంగాణ సీఎం కేసీఆర్
- ‘కరోనా’ వ్యాప్తి తగ్గడం శుభసూచకం
- రేపటితో 21 జిల్లాల్లో ఒక్క కరోనా యాక్టివ్ కేసు ఉండదు
- రాబోయే రోజుల్లో ‘కరోనా’ రహిత తెలంగాణగా మారనుంది
తెలంగాణలో ‘కరోనా’ వైరస్ వ్యాప్తి చెందడం తగ్గుముఖం పడుతుండటం శుభసూచకమని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రధాని మోదీతో ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతరం ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా ‘కరోనా’ వైరస్ వ్యాప్తి, రోగులకు అందుతున్న చికిత్స, సహాయ కార్యక్రమాలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, రేపటితో రాష్ట్రంలోని 21 జిల్లాలు ఒక్క కరోనా యాక్టివ్ కేసు లేని జిల్లాలుగా మారుతున్నాయని ప్రకటించారు. రాబోయే రోజుల్లో ‘కరోనా’ రహిత రాష్ట్రంగా తెలంగాణ మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. ఈ వైరస్ బారిన పడ్డ వారిలో 97 శాతానికి పైగా పేషెంట్లు కోలుకుని డిశ్చార్జి అవుతుండటం మంచి పరిణామం అని అన్నారు. అనుకోని పరిస్థితుల్లో మళ్లీ పాజిటివ్ కేసులు వచ్చినా వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవడానికి వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందని అన్నారు. ముందుగా ప్రకటించినట్టుగా మే 7 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని, ప్రజలు సహకరించాలని కోెరారు.