Jagan: ‘కరోనా’ రోగులను అంటరానివారిగా చూడొద్దు: ఏపీ సీఎం జగన్
- ‘కరోనా’ నాతో పాటు ఎవరికైనా రావొచ్చు
- ఈ వైరస్ సోకిన వారిపై వివక్ష చూపొద్దు
- ప్రజలు రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి
‘కరోనా’ రోగులను అంటరానివారిగా చూడొద్దని, వారిపై వివక్ష చూపొద్దని ఏపీ సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ప్రజలనుద్దేశించి ఈరోజు ఆయన మాట్లాడుతూ, దాదాపు నెలరోజులకు పైబడి లాక్ డౌన్ కొనసాగుతోందని, చాలా అడుగులు ముందుకు వేయగలిగామని అన్నారు.ఇలాంటి పరిస్థితులు ఎదురైతే టెస్టులు చేసే పరిస్థితి ఇంతకుముందు ఏపీలో లేదని, ఇప్పుడు టెస్టింగ్ సామర్థ్యాన్ని బాగా పెంచుకోగలిగామని చెప్పారు. ‘కరోనా’ వైరస్ తనతో పాటు ఎవరికైనా రావొచ్చు కనుక, జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని అన్నారు. వయసు పైబడిన వారు, బీపీ, షుగర్, ఆస్తమా ఉన్న వాళ్లపైనే ఈ వైరస్ కాస్తోకూస్తో ప్రభావం చూపిస్తుంది తప్ప, మిగిలిన వాళ్లపై ప్రభావం ఉండదన్న విషయం స్పష్టంగా కనబడుతోందని అన్నారు.
ఆసుపత్రులకు రాకుండానే చాలా మందికి నయమయ్యే పరిస్థితి ఉందని చెప్పారు. ‘కరోనా’ లక్షణాలు ఎవరికైనా ఉంటే వెంటనే తెలియజేస్తే వైద్యులు వచ్చి తగిన చికిత్స అందిస్తారని, వేరే వాళ్లకు సోకకుండా ఉంటుందని అన్నారు. ప్రజలు రోగ నిరోధక శక్తి పెంచుకోవడం ద్వారా ఇటువంటి వాటి బారినపడకుండా ఉండొచ్చని సూచించారు. ‘కరోనా’ లక్షణాలు ఎవరికైనా ఉంటే వెంటనే తెలియజేయాలని, తగిన వైద్యం అందిస్తామని చెప్పారు.