Elisa Graneto: నేను చనిపోలేదు, నిక్షేపంలా ఉన్నా: యూకేలో తొలి కరోనా టీకా వేయించుకున్న ఎలీసా గ్రనటో
- మైక్రోబయాలజిస్ట్ గా పని చేస్తున్న డాక్టర్ ఎలీసా
- టీకా వేయించుకున్న రెండు రోజులకే మరణించినట్టు వార్త
- తనకు ఏమీ కాలేదని వీడియో విడుదల చేసిన ఎలీసా
ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ను పరీక్షించేందుకు యూకేలో 800 మంది వలంటీర్లను ఎంపిక చేయగా, వీరిలో మొదటిగా టీకా వేయించుకున్న వారిలో ఒకరైన 32 ఏళ్ల మైక్రో బయాలజిస్ట్, డాక్టర్ ఎలీసా గ్రనటో మరణించినట్టు ఓ ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కాగా, తాను క్షేమంగా ఉన్నానని ఆమే స్వయంగా మీడియా ముందుకు వచ్చారు.
ఈ టీకా వల్ల తనకు ముప్పు ఉండవచ్చని తెలిసినా ఒక సైంటిస్ట్ గా కొత్త మందులను కనుగొనడంతో పాటు, ప్రయోగ పరీక్షలలో నా వంతు భాగస్వామ్యం ఉండాలన్న ఆలోచనతో తాను ముందుకు వచ్చానని, ప్రస్తుతం తాను నిక్షేపంలా ఉన్నానని, తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేశారని తన ట్విట్టర్ ఖాతాలో చెప్పుకొచ్చారు.
"నేడు ఆదివారం. ఏప్రిల్ 26. నేను టీ తాగుతున్నాను. నేటికి నేను వాక్సిన్ తీసుకుని మూడు రోజులు అయింది. ఇప్పటివరకూ నాకు ఏమీ కాలేదు. నేను చాలా బాగా ఉన్నాను. ఆదివారాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. మిగతా ప్రపంచమంతా బాగానే ఉందని భావిస్తున్నాను" అంటూ ఆమె ఓ వీడియోను విడుదల చేశారు.
ఇక, బ్రిటీష్ ప్రభుత్వం సైతం ఈ తప్పుడు వార్తపై స్పందించింది. ఇది అవాస్తవమని, ఇటువంటి వార్తలకు ఆన్ లైన్ లో ప్రచారం కల్పిస్తే, చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ సోషల్ కేర్ విభాగం ఆదివారం నాడు ఓ ట్వీట్ ను పెడుతూ, ఇటువంటి అనుమానాస్పద వార్తలు కనిపిస్తే, చెక్ లిస్ట్ లో ఓ మారు ధ్రువీకరించుకోవాలని, ప్రపంచానికి కీడు చేసే ఈ తరహా వార్తలను ఫార్వార్డ్ చేయవద్దని సూచించింది.
కాగా, అంతకుముందు, తన పుట్టినరోజు నాడే ఎలీసా గ్రనటో వాక్సిన్ వేయించుకున్నారని, ఆపై రెండు రోజులకే అది వికటించి ఆమె చనిపోయారని వార్తలు రావడం ప్రపంచవ్యాప్తంగా షాక్ కలిగించింది. ఆమెతో పాటు వాక్సిన్ తీసుకున్న నలుగురి శరీరంలోనూ మార్పులు వస్తుండగా, శాస్త్రవేత్తలు, తమ పరిశోధనలను ముమ్మరం చేశారని కూడా ఈ వార్త పేర్కొంది.