Mumbai: ముస్లింలకు ఎలాంటి మినహాయింపులు ఉండవు.. డ్రోన్లతో నిఘా పెట్టాం: ముంబై పోలీసులు
- ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాలపై డ్రోన్లతో నిఘా
- రంజాన్ ప్రార్థనల సందర్భంగా గుమికూడకుండా చర్యలు
- లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు
ముస్లింలు అత్యంత పవిత్రంగా ఆచరించే రంజాన్ మాసం ప్రారంభమైంది. అయితే, కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో... ముంబైలో ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాలపై పోలీసులు డ్రోన్లతో నిఘా పెట్టారు.
ఈ సందర్భంగా ముంబై పోలీస్ అధికార ప్రతినిధి ప్రణయ్ అశోక్ మాట్లాడుతూ, ఈరోజు నుంచి రంజాన్ ఉపవాసాలు ప్రారంభమయ్యాయని... ఈ నేపథ్యంలో ముస్లింలు ఒక చోట గుమికూడకుండా, సామాజిక దూరం పాటించేలా చూస్తామని చెప్పారు. ముస్లింలకు ప్రత్యేకంగా ఎలాంటి మినహాయింపులు లేవని తెలిపారు.
ముస్లింల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా పెట్టామని చెప్పారు. రంజాన్ మాసం సందర్భంగా మసీదులు, భవనాలు, టెర్రస్ లపై ముస్లింలు గుమికూడకుండా నిఘా ఉంచామని తెలిపారు. భద్రతను కట్టుదిట్టం చేశామని... లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముస్లిం ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉంటుందని చెప్పారు. కంటైన్మెంట్ జోన్లలో ఉన్నవారి ఇంటి వద్దకే నిత్యావసర వస్తువులను పంపిస్తామని తెలిపారు. మరోవైపు, పూణేలోని ఆజాం క్యాంపస్ మసీదును క్వారంటైన్ కేంద్రంగా మార్చారు.