Sampoornesh Babu: కులవృత్తిని గుర్తు చేసుకుంటూ... భార్యకు, పిల్లలకు వెండి నగలు తయారు చేసిన సంపూర్ణేశ్ బాబు!
- రాజు, పేద.. రెండింటికీ పెద్ద తేడా లేదు
- నీ డబ్బు, ఆస్తి.. నీ వెనుక రావు
- నీవు ఎక్కడి నుంచి వచ్చావో అది మర్చిపోకు
సినీ పరిశ్రమలో ఎదగాలంటే గాడ్ ఫాదర్లు, బ్యాక్ గ్రౌండ్ చాలా అవసరం. అయితే ఇవేవీ లేకుండానే తన స్వశక్తితో ఎదిగాడు హీరో సంపూర్ణేశ్ బాబు. టాలీవుడ్ లో మంచి నటుడిగా గుర్తింపు పొందినప్పటికీ సంపూర్ణేశ్ బాబులో ఎలాంటి మార్పు రాలేదు. సినిమాల్లోకి రాక ముందు ఎలాంటి సాధారణ జీవితాన్ని గడిపాడో... ఇప్పుడు కూడా అలాంటి జీవితాన్నే గడిపేందుకు ఇష్టపడుతుంటాడు. తాజాగా సినీ ప్రముఖులంతా చేస్తున్న 'బీ ది రియల్ మేన్' ఛాలెంజ్ ను తనదైన శైలిలో చేశాడు. తనకు ఎవరూ ఛాలెంజ్ విసరకపోయినా... తనంతట తానుగా ఛాలెంజ్ ను పూర్తి చేసి... వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
తన పాత కంసాలి వృత్తిలోకి దిగి... తాను ఎంతో ప్రేమించే భార్యకు వెండితో కాలి మెట్టెలు, పిల్లలకు గజ్జెలు తయారు చేసి ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు నెటిజెన్లను ఆకట్టుకుంటున్నాయి. 'రాజు, పేద.. పెద్ద తేడా లేదు. నీ డబ్బు, ఆస్తి నీ వెనుక రావు. నువ్వెక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు అని గుర్తు చేసుకుంటూ... మా ఆవిడ కోసం నా పాత కంసాలి వృత్తిని గుర్తు చేసుకుంటూ... ఇంట్లో మిగిలిన గజ్జెలతో ఆమె కాలికి మెట్టెలు, పిల్లల కోసం గజ్జెలు చేసి ఇచ్చాను' అని ట్వీట్ చేశాడు. సంపూర్ణేశ్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.