Domestic violence: లాక్ డౌన్ సందర్భంగా ఏపీలో భారీగా పెరిగిన గృహహింస కేసులు!
- దిశ సెంటర్లలో నెల రోజుల్లో 117 కేసులు నమోదు
- వీటిలో 45 కేసులు గృహహింస, 11 అత్యాచారం కేసులు
- పలు కారణాలతో ఫ్రస్టేషన్ కు గురవుతున్న భర్తలు
కరోనా వైరస్ కట్టడి చేయడంలో కీలక పాత్రను పోషిస్తున్న లాక్ డౌన్... మరోవైపు, ఏపీలో గృహహింస పెరగడానికి కూడా కారణమవుతోంది. లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో ఇతర నేరాలు గణనీయంగా తగ్గినప్పటికీ.. గృహహింస మాత్రం ఎక్కువవుతోంది.
మహిళ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ, మార్చి 23 నుంచి ఏప్రిల్ 21 వరకు దిశ సెంటర్లలో 117 కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీటిలో 45 కేసులు గృహహింస, 11 అత్యాచారం కేసులు, 3 లైంగిక వేధింపుల కేసులు, చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులు 9, మహిళలపై సైబర్ క్రైమ్ కేసులు 5, ఒక బాల్య వివాహం కేసు నమోదయ్యాయని వెల్లడించారు. మిగిలిన కేసులు వివిధ ఇతర కారణాలతో నమోదయ్యాయని తెలిపారు.
అయితే, లాక్ డౌన్ కారణంగా ఫిర్యాదులు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు రాలేని వారు కూడా ఎక్కువగానే ఉన్నారని... వీరంతా ఫిర్యాదుల ఇస్తే, కేసుల సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పారు.
లాక్ డౌన్ సందర్భంగా ఏపీలో గృహహింస పెరగడం ఆందోళనకరమని కృతికా శుక్లా అన్నారు. గతంలో వారానికి 10 కేసులు వచ్చేవని... ఇప్పుడు వాటి సంఖ్య 20కి పెరిగిందని చెప్పారు. లాక్ డౌన్ కారణంగా మగవాళ్లు ఇళ్లలోనే ఉంటున్నారని... ఇంటి పనుల్లో సహకరించడానికి కొందరు ఇష్టపడటం లేదని... ఈ పరిస్థితుల్లో ఫ్రస్ట్రేషన్ కు లోనై మహిళలపై హింసకు పాల్పడుతున్నారని చెప్పారు. ఆల్కహాల్ దొరకకపోవడం కూడా పురుషుల ఫ్రస్ట్రేషన్ కు మరో కారణమని తెలిపారు.
తమకు ఫిర్యాదులు అందిన వెంటనే భర్తలకు, ఇతర కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇస్తున్నామని కృతికా చెప్పారు. శాలరీ కట్, ఉద్యోగాలు కోల్పోవడం వంటివి జనాలపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయని... గృహహింస పెరగడానికి ఇది కూడా కారణమని అన్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారు తమ ఫ్రస్ట్రేషన్ ను భార్యలపై చూపుతున్నారని చెప్పారు.