Corona Virus: కరోనాతో వచ్చే న్యూమోనియా ఎంత ప్రమాదకరమో విపులంగా చెప్పిన అమెరికన్ డాక్టర్!

Dr Richard Levitan tells about corona caused pneumonia

  • లక్షణాలు లేకుండానే శరీరంలో పాకిపోతుందని వెల్లడి
  • ఆక్సిజన్ స్థాయి పడిపోతుందని వివరణ
  • సైలెంట్ హైపోక్సియా అని నామకరణం

అమెరికాలో కరోనా వైరస్ రక్కసి ఎంతటి విలయం సృష్టిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచంలోనే అత్యంత దారుణ పరిస్థితులకు అమెరికా ఓ ఉదాహరణగా నిలుస్తోంది. ఇప్పటివరకు 8.5 లక్షల మందికి కరోనా సోకగా, 48 వేల మంది మృత్యువాత పడ్డారు. నిత్యం వేల సంఖ్యలో మరణాలతో అగ్రరాజ్యం అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలో, అక్కడి బెల్లెవ్యూ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో సేవలు అందించిన డాక్టర్ రిచర్డ్ లెవిటన్ కరోనా మహమ్మారి గురించి ఆసక్తికరమైన వివరాలు తెలిపారు.

"నేను 30 ఏళ్లుగా అత్యవసర వైద్య విభాగంలో నిపుణుడిగా సేవలు అందిస్తున్నాను. శ్వాస సంబంధిత రోగులకు పైపుల ద్వారా శ్వాస అందించడంలో కొత్త విధానాలు రూపొందించి ప్రపంచవ్యాప్తంగా వాటిని ఇతర వైద్యులకు నేర్పిస్తున్నాను. మార్చి 10 నాటికి కరోనా కేసులు వెల్లువెత్తుతుండడంతో న్యూయార్క్ నగరంలోని బెల్లెవ్యూ హాస్పిటల్లో 10 రోజులు స్వచ్ఛందంగా సేవలు అందించాను. ఆ ఆసుపత్రిలోనే నేను శిక్షణ పొందాను కాబట్టి అది నా కర్తవ్వం అని భావించాను.

అయితే, బెల్లెవ్యూ ఆసుపత్రిలో విధుల్లో ఉండగా, అక్కడికి వచ్చే కరోనా పేషెంట్ల లక్షణాలు ఎంతో విస్మయం కలిగించేవి. వారికి ఎలాంటి శ్వాసకోశ వ్యాధులు లేకపోయినా, న్యూమోనియా (ఊపిరితిత్తులకు నెమ్ము చేరడం) లక్షణాలతో బాధపడేవారు. కొవిడ్ కారణంగా కలిగే ఈ నెమ్ము ఎంత ప్రమాదకరం అంటే, చివరికి రోగులు దాంతోనే ప్రాణాలు విడిచేవారు. కొవిడ్ వైరస్ కలిగించే నెమ్మును మొదట్లోనే గుర్తించలేకపోతున్నామా అనిపించింది. ఊపిరితిత్తుల నిపుణుడైన నా స్నేహితుడు నిక్ కపుటో కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశాడు. ఇలాంటి వ్యాధిని, వ్యాధి లక్షణాలను ఎప్పుడూ చూడలేదన్నాడు.

సాధారణంగా ఓ ఆసుపత్రి ఎమర్జెన్సీ విభాగంలో హార్ట్ అటాక్ పేషెంట్లు, బ్రెయిన్ స్ట్రోక్ బాధితులు, తల దెబ్బకు గురైన వ్యక్తులు, ఇంకా ఇతర వ్యాధి గ్రస్తులు ఉంటారు. కానీ, నేను బెల్లెవ్యూ హాస్పిటల్ లో ఉన్నన్ని రోజులూ ఎమర్జెన్సీ విభాగంలో కొవిడ్ నెమ్ము పేషెంట్లు ఉండేవారు. నేను ట్రీట్ మెంట్ ప్రారంభించిన మొదటి గంటలోనే ఇద్దరికి ట్యూబుల ద్వారా శ్వాస అందించాల్సిన విషమ పరిస్థితి ఏర్పడింది. శ్వాస సమస్యలు లేనివాళ్లే కాదు, కిందపడి దెబ్బలు తగిలించుకున్నవాళ్లు, ఇతర కారణాలతో అచేతనంగా మారిపోయిన వారిలో, పెద్ద సంఖ్యలో షుగర్ వ్యాధిగ్రస్తుల్లోనూ కరోనా కారణంగా కలిగే నెమ్ము కనిపించింది.

ఇక్కడ మాకు మరింత విస్మయం కలిగించిన అంశం ఏమిటంటే.... ఈ పేషెంట్లలో ఎవరూ శ్వాస సంబంధ సమస్యలు వచ్చినట్టు ఫిర్యాదు చేయలేదు. అయితే వారి ఛాతీలను ఎక్స్ రే తీసినప్పుడు నెమ్ము ఆనవాళ్లు భారీగా కనిపించాయి, వారిలో ఆక్సిజన్ స్థాయిలు కూడా పడిపోయాయి... ఇదెలా సాధ్యం? అనిపించింది. క్రమంగా మాకు అర్థమైంది ఏమిటంటే, ఈ కరోనా నెమ్ము ఓ సైలెంట్ కిల్లర్.

ఈ వైరస్ కారణంగా కలిగే నెమ్ము బయటికి ఏమీ కనిపించదు. సాధారణ నెమ్ములో కనిపించే లక్షణాలు దీనికి వర్తించవని, ఇది నిశ్శబ్దంగా చంపేస్తుందని అర్థమైంది. శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో మరణం సంభవిస్తోన్నట్టు గుర్తించాం. అందుకే దీన్ని సైలెంట్ హైపోక్సియా అని పిలుస్తున్నాం. ఇలాంటి తరుణంలో మేం సూచించేది ఒక్కటే. కరోనాతో వచ్చే రోగులకు మొదట్లోనే న్యూమోనియా పరీక్షలు చేసి నెమ్మును గుర్తించాలి. ఈ సైలెంట్ హైపోక్సియాను గుర్తించలేకపోతే మాత్రం ఎంతో నష్టం జరుగుతుంది. ఆ వైరస్ ను లక్షణాల ఆధారంగా వేటాడడం కంటే దానికంటే ఓ అడుగు ముందు ఉండడమే సరైన చికిత్స అనుకుంటున్నాం" అంటూ లెవిటన్ తన అనుభవాలను వివరించారు.

  • Loading...

More Telugu News