america: అమెరికాకు విదేశీ వలసల నిషేధంపై ట్రంప్ సంతకం
- 60 రోజుల పాటు అమల్లో ఉండనున్న ఉత్తర్వులు
- అనేక సడలింపులు ఇచ్చిన ప్రభుత్వం
- ఇప్పటికే ఆ దేశంలో ఉన్న ఉద్యోగులకు ఇబ్బంది లేదు
అగ్రరాజ్యం అమెరికాలోకి విదేశీ వలసలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన ఆ దేశ అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్.. దానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకం చేశారు. అయితే, ఉత్తర్వుల వల్ల కొద్ది మంది వలసదారులకే గ్రీన్‌కార్డుల జారీ ఆలస్యం అవుతుందని నిపుణులు అంటున్నారు. కరోనా వైరస్ కారణంగా అమెరికా ఆర్థిక రంగం తీవ్రంగా దెబ్బతింది. చాలా మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అమెరికన్ల ఉపాధి దెబ్బతినకుండా ఉండేందుకు వలసలపై నిషేధం విధిస్తామని ట్రంప్ కొన్ని రోజుల కిందట ప్రకటించారు.
చెప్పినట్టుగానే ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. అయితే, ఇందులో చాలా సడలింపులు ఇచ్చారు. 60 రోజుల పాటు అమల్లో ఉండే ఈ ఉత్తర్వుల కారణంగా ఇప్పటికే అమెరికాలో ఉన్న తాత్కాలిక ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే, దేశంలో పని చేస్తున్న, అక్కడికి వచ్చి సేవలు అందించాలని అనుకుంటున్న వైద్యులు, నర్సులు, వారి భార్య, భర్తలకు ఈ నిషేధం వర్తించదు. అలాగే, ప్రతి ఏడాది జారీ చేసే వేలాది తాత్కాలిక వర్క్ వీసాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.