Telangana: ఏపీ బాటలో తెలంగాణ... దుకాణాలు తెరచివుంచే సమయం కుదింపు!
- ఉదయం 11 గంటల వరకే కొనుగోళ్లకు అనుమతి
- తొలి దశలో కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అమలు
- అన్ని జిల్లాల అధికారులకూ డీజీపీ ఆదేశాలు
- లాక్ డౌన్ పై మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి మే 7 వరకూ లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో నిర్ణయించారు. ఎట్టి పరిస్థితుల్లో నిబంధనలను అతిక్రమించే వారిపై జాలి చూపరాదని, వారి వాహనాలు స్వాధీనం చేసుకోవాలని, ఇంటి చిరునామాకు 3 కిలోమీటర్ల పరిధి దాటి వెళ్లేందుకు ఎవరినీ అనుమతించవద్దని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లను డీజీపీ ఆదేశించారు.
ఇక, ఇదే సమయంలో కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో నిత్యావసర దుకాణాలను ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే అమలు చేయాలని నిర్ణయించారు. ఈ విషయమై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడకపోయినా, కిరాణా దుకాణాలను 11 తరువాత తెరిచేందుకు అనుమతించేది లేదని పోలీసులు మౌఖికంగా యజమానులను హెచ్చరించారు. బుధవారం నుంచి కావాల్సిన వస్తువులను 11 గంటల్లోగా తీసుకుని ఇళ్లకు చేరాలని, ఆపై బయటకు రావద్దని ఆదేశించారు.
కాగా, ఏపీలో లాక్ డౌన్ నిబంధనలు అమలులోకి వచ్చినప్పటి నుంచి ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకూ మాత్రమే ప్రజలు బయటకు వచ్చేందుకు అనుమతి ఇస్తున్నారన్న సంగతి తెలిసిందే. అయితే, తెలంగాణలో మాత్రం సాయంత్రం 6 గంటల వరకూ పర్మిషన్ ఇచ్చారు. తక్కువ సమయం ఇస్తే, ఒకేసారి ప్రజలు వీధుల్లోకి వస్తే, భౌతిక దూరం పాటించడం కష్టమవుతుందని ప్రభుత్వం భావించగా, ఇచ్చిన వెసులుబాటును కొందరు దుర్వినియోగం చేస్తుండటంతో పరిస్థితి జటిలంగా మారుతోంది. అందువల్లే కొనుగోలు సమయాన్ని కుదించాలని పోలీసులు నిర్ణయించారు.
వాణిజ్య సముదాయాలు, గవర్నమెంట్ ఆఫీసులు, పెట్రోలు బంకుల పనివేళలను కూడా తగ్గించాలని ఈ సమీక్షలో నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనిపై నేడు ఓ స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక ఎవరికైనా వైద్య పరమైన అవసరం ఏర్పడితే, 100కు డయల్ చేయాలని డీజీపీ సూచించారు.
నిన్న ఒక్కరోజులో హైదరాబాద్ పరిధిలో నిబంధనలను ఉల్లంఘించిన 2,600 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకోగా, దీంతో ఇంతవరకూ పోలీసు స్టేషన్లకు చేరిన వాహనాల సంఖ్య 1.21 లక్షలు దాటింది. అత్యవసరమని భావిస్తేనే పోలీసులు పాస్ లను జారీ చేస్తున్నారు. పలు చెక్ పోస్టుల వద్ద ఉన్నతాధికారులే మకాం వేసి, పరిస్థితులను స్వయంగా పరిశీలిస్తున్నారు. ఈ రెండు వారాలూ మరింత కఠినంగా వ్యవహరిస్తే, కరోనాను నియంత్రణలోకి తేవచ్చని భావిస్తున్నారు.