Hyderabad: హైదరాబాద్ లో వెల్లివిరిసిన మానవత్వం... ఇరుగుపొరుగు కాదన్నవేళ హిందువు పాడె మోసిన ముస్లింలు!

Muslims carried Hindu man bier in Hyderabad

  • క్షయతో మృతి చెందిన ఆటో డ్రైవర్
  • కరోనాతో చనిపోయాడని భావించి సహాయ నిరాకరణ చేసిన స్థానికులు
  • అంత్యక్రియలు జరిపించిన ముస్లింలు

హైదరాబాద్ లో మానవత్వాన్ని చాటిన సంఘటన చోటుచేసుకుంది. చనిపోయిన ఓ హిందూ వ్యక్తిని శ్మశానానికి తీసుకెళ్లేందుకు ఇరుగుపొరుగు నిరాకరించినవేళ,  ఐదుగురు ముస్లింలు ముందుకు వచ్చి అంతిమయాత్ర జరిపించిన వైనం అందరినీ ఆకట్టుకుంటోంది. ఖైరతాబాద్ కు చెందిన వేణు ముదిరాజ్ ఓ ఆటో డ్రైవర్. వయసు 50 సంవత్సరాలు. అయితే క్షయ వ్యాధి ముదరడంతో వేణు ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 16న మరణించాడు. అతడి భార్య ఎప్పుడో చనిపోయింది. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కాగా, ఇరుగుపొరుగు వారు మాత్రం వేణు కరోనాతో చనిపోయాడని భావించి అతడి మృతదేహాన్ని కాలనీకి తీసుకువచ్చేందుకు అభ్యంతరం చెప్పారు. సాయం చేసేందుకు నిరాకరించారు. వేణు పిల్లల వద్ద అంత్యక్రియలకు అవసరమైన డబ్బు కూడా లేదు. ఈ విషయం తెలిసిన సాదిక్ బిన్ సలామ్ అనే ముస్లిం సామాజిక కార్యకర్త తన నలుగురు మిత్రులైన మాజిద్, ముక్తాదిర్, అహ్మద్, ఖాసిమ్ లకు సమాచారం అందించాడు. వెంటనే వారందరూ అక్కడికి చేరుకుని ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. హిందూ శ్మశానవాటిక వరకు పాడె మోసి వేణు అంత్యక్రియలు జరిపించారు.

అనంతరం సలామ్ మాట్లాడుతూ, కరోనా వైరస్ వ్యాప్తికి తమ సామాజిక వర్గమే కారణమని ఆరోపణలు వస్తున్నా, అందరం ఒక్కటేనని ఈ విధంగా నిరూపించామని, విభేదాలు, విద్వేషాలు రగిల్చే ప్రయత్నాలను పట్టించుకోకుండా ముందుకు వచ్చామని తెలిపారు.

  • Loading...

More Telugu News