Andhra Pradesh: గుంటూరులో అధికారుల పొరపాటు.. కరోనా బాధితుడిని వదిలేసిన వైనం!
- కాటూరి వైద్య కళాశాలలో ఘటన
- ఇద్దరి పేర్లూ ఒకటే కావడంతో అధికారుల పొరపాటు
- తప్పుదిద్దుకుని మళ్లీ క్వారంటైన్‌కు తరలించిన అధికారులు
కరోనాకు చికిత్స పొందుతున్న ఇద్దరి పేర్లూ ఒకటే కావడంతో పొరపాటు పడిన అధికారులు ఒకరికి బదులుగా మరొకరిని విడుదల చేయడం కలకలం రేపింది. గుంటూరులోని కాటూరి వైద్య కళాశాల క్వారంటైన్ కేంద్రంలో జరిగిందీ ఘటన.
ఇక్కడ ఇద్దరు కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. వారిద్దరి పేర్లూ ఒకటే. ఇద్దరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకరికి నెగటివ్ అని తేలింది. దీంతో అధికారులు అతడిని డిశ్చార్జ్ చేయాలని నిర్ణయించారు. అయితే, రోగుల ఇద్దరి పేర్లూ ఒకటే కావడంతో నెగటివ్ వచ్చిన వ్యక్తికి బదులుగా తాడేపల్లికి చెందిన వ్యక్తికి ధ్రువపత్రంతోపాటు రెండు వేల రూపాయల నగదు అందజేసి శనివారం రాత్రి ఇంటికి పంపారు.
ఆదివారం ఉదయం జరిగిన పొరపాటును గుర్తించిన అధికారులు తప్పు దిద్దుకునే ప్రయత్నం చేశారు. వెంటనే తాడేపల్లికి చేరుకుని జరిగిన విషయం చెప్పి క్వారంటైన్‌కు రావాల్సిందిగా సూచించారు. అయితే, క్వారంటైన్‌కు వెళ్లేందుకు అతడు నిరాకరించాడు. తనకు వైరస్ లేదని అధికారులు ఇచ్చిన ధ్రువపత్రాన్ని చూపించి ఆసుపత్రికి రానంటే రానని తెగేసి చెప్పాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎట్టకేలకు అతడు కదిలాడు. 108 అంబులెన్స్‌లో ఎన్నారై వైద్యశాలలోని ఐసోలేషన్‌కు తరలించారు. అప్పటికే అతడు కుటుంబ సభ్యులతో కలిసిపోవడంతో అతడి భార్య, కుమార్తెతోపాటు మరో ఇద్దరిని మరో అంబులెన్స్‌లో క్వారంటైన్‌కు తరలించారు.