Madhya Pradesh: లాక్‌డౌన్ ఎఫెక్ట్: క్రూరమృగాల బారిన పడి ప్రాణాలొదులుతున్న జనం!
- లాక్‌డౌన్ కారణంగా నిశ్శబ్దంగా మారిన అటవీ సమీప ప్రాంతాలు
- జనావాసాల్లోకి యథేచ్ఛగా వచ్చేస్తున్న పులులు, ఏనుగులు
- మధ్యప్రదేశ్‌లో 13 మంది బలి
ప్రాణాంతక కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ కారణంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఫలితంగా రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యాయి. ఇది అటవీ జంతువులకు వరంగా మారినట్టు కనిపిస్తోంది. జనసంచారం లేకపోవడంతో చుట్టుపక్కల ఉన్న అడవుల నుంచి రోడ్లపైకి వస్తూ యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. ముఖ్యంగా చిరుత పులులు, పులులు, ఏనుగులు రోడ్లపైకి వస్తున్న వార్తలు ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇలా వచ్చినవి జనావాసాల్లోకి చొరబడి మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో వీటి కారణంగా ఇప్పటి వరకు 13 మంది చనిపోయినట్టు అధికారులు తెలిపారు.
లాక్‌డౌన్ కారణంగా పట్టణ ప్రాంతాలు పిన్‌డ్రాప్ సైలెన్స్‌గా మారాయని, అటవీ జంతువులు ఈ నిశ్శబ్దాన్ని తప్పుగా అర్థం చేసుకుని అది కూడా తమ ప్రాంతమేనన్న భ్రమలో పట్టణాల్లోకి వస్తున్నాయని అధికారి ఒకరు తెలిపారు. గత మూడు వారాలుగా ఇది మరింత పెరిగిందని, క్రూరమృగాలు జనావాసాల్లోకి రావడం ఎక్కువైందని ఆయన పేర్కొన్నారు. పులుల దాడిలో నలుగురు, ఏనుగులు దాడిలో నలుగురు మరణించారని, ఎలుగుబంట్లు, చిరుతపులులు ఇద్దరు చొప్పున బలితీసుకున్నాయని, అడవి పంది దాడిలో మరొకరు ప్రాణాలు కోల్పోయారని అధికారులు వివరించారు. ఇవన్నీ అటవీ ప్రాంతం విస్తరించిన సెయోని, షాదోల్, రాట్లాం, అనుప్పూర్, సిధి తదితర జిల్లాల్లో జరిగాయని అన్నారు.
అటవీ జంతువులు గతంలో ఎప్పుడూ వాటి పరిధిని దాటి బయటకు రాలేదని, వాటికి వాటి సరిహద్దులేంటో తెలుసని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (వైల్డ్ లైఫ్) రాజేశ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఇప్పుడు ఒక్కసారిగా జనసమ్మర్థం తగ్గిపోయి నిర్మానుష్యంగా మారడంతో అవి తమ గీతను దాటుతున్నాయని అన్నారు. ఇంత తక్కువ సమయంలో ఇంతమంది క్రూరమృగాల బారినపడి చనిపోయిన సందర్భాలు గతంలో లేవని అన్నారు. అటవీ ప్రాంతాలు, అభయారణ్యాల చుట్టుపక్కల లాక్‌డౌన్ కారణంగా ఏర్పడిన నిశ్శబ్దమే ఇందుకు కారణమని శ్రీవాస్తవ వివరించారు.