Rudresh: మా జిల్లాలో కరోనా వ్యాపిస్తే కుమారస్వామి కుటుంబానిదే బాధ్యత: రామనగర బీజేపీ చీఫ్
- రామనగర జిల్లాలో నిఖిల్ కుమారస్వామి వివాహం
- 200 కార్లలో అతిథుల రాక!
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జిల్లా బీజేపీ చీఫ్
కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ వివాహం నేపథ్యంలో రాజకీయ దుమారం రేగుతోంది. లాక్ డౌన్ నిబంధనలను తుంగలో తొక్కి కుమారస్వామి ఈ పెళ్లి చేశాడని బీజేపీ మండిపడుతోంది. ఈ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు భారీ సంఖ్యలో అతిథులు వెళ్లారని, దాదాపు 150 నుంచి 200 వరకు కార్లు తరలివెళ్లినట్టు సమాచారం ఉందని రామనగర జిల్లా బీజేపీ అధ్యక్షుడు రుద్రేశ్ తెలిపారు.
ఇప్పటివరకు రామనగర జిల్లాలో కరోనా కేసుల్లేవని, తాము గ్రీన్ జోన్ లో ఉన్నామని, ఒకవేళ ఇక్కడ కరోనా వ్యాపించిందంటే అందుకు కుమారస్వామి కుటుంబమే బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. అటు, పేదలకు సాయపడేందుకు ప్రయత్నిస్తున్న సామాజిక కార్యకర్తలకు అనుమతులు ఇవ్వకుండా, ఇలాంటి పెళ్లిళ్లకు వెళ్లే వాహనాలకు అనుమతులు ఇవ్వడం ఏంటని రుద్రేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.