Corona Virus: కరోనాకు టీకా తయారీలో భారత్‌లో ఆరు సంస్థల పోటాపోటీ

Race for vaccine against coronavirus heats up in India 6 firms in the fray

  • వేర్వేరుగా టీకాల అభివృద్ధి కోసం పరిశోధనలు
  • 2021 తర్వాతే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం
  • రెండు సంస్థలకే డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు

కరోనా మహమ్మారిని నివారించేందుకు అనేక దేశాలు కృషి చేస్తున్నాయి. ఈ వైరస్ కోసం టీకాను అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. చైనాకు చెందిన ఓ పరిశోధన సంస్థ అందరికంటే ముందుగా రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌లోకి అడుగుపెట్టింది. భారత్‌కు చెందిన డ్రగ్ సంస్థలు కూడా ఏ మాత్రం తక్కువ కాదు.  కరోనాకు టీకాలను తయారు చేసేందుకు భారత్‌కు చెందిన  ఆరు సంస్థలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. మన దేశంలో క్యాడిలా హెల్త్‌ కేర్ (జైడస్ క్యాడిలా), సీరం ఇనిస్టిట్యూట్, ఇండియన్ ఇమ్యూనాలజికల్స్, మిన్ వ్యాక్స్, బయోలాజికల్ ఇ, భారత్ బయోటెక్ సంస్థలు వేర్వేరు టీకాల తయారీకి పరిశోధనలు చేస్తున్నాయని ఫరీదాబాద్ లోని ‘అంటువ్యాధి సంసిద్ధత అవిష్కరణల కూటమి’ వైస్ చైర్మన్ గగన్ దీప్ కాంగ్ వెల్లడించారు.

ఇతర వైరస్ టీకాలతో పోలిస్తే కరోనా వైరస్ టీకా తయారీకి కూడా పదేళ్లు పట్టవచ్చన్నారు.  కానీ పరిశోధనలు వేగవంతం అయినందున ఇప్పుడు కనీసం ఏడాదైనా పడుతుందన్నారు. అందువల్ల 2021 తర్వాతే టీకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావచ్చని కాంగ్ అభిప్రాయపడ్డారు. సాధారణంగా  టీకాల తయారీకి వివిధ దశల్లో పరీక్షలు ఉంటాయని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. తదుపరి అనుమతి కోసం కూడా మరికొంత  సమయం పడుతుందని, అందువల్ల ఈ ఏడాదిలో కరోనా టీకా చాన్స్ లేదన్నారు.

కరోనా టీకా తయారు చేస్తున్న అంతర్జాతీయ కంపెనీల్లో మన దేశం నుంచి క్యాడిలా, సీరం ఇనిస్టిట్యూట్ పేర్లను మాత్రమే ప్రపంచ ఆరోగ్య సంస్థ  గుర్తించింది. డబ్ల్యూహెచ్ఓ వివరాల ప్రకారం, ప్రపంచంలో ప్రస్తుతం 3 కరోనా వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్ దశలో ఉన్నాయి. అంటే మనుషులపై ప్రయోగించేందుకు ఇవి సిద్ధమయ్యాయి. ఇక ప్రీ క్లినికల్ ఫేజ్ లో మరో 70 వ్యాక్సిన్లు ఉన్నాయి. ఇవి ల్యాబ్ లేదా జంతువులపై పరీక్షించే  దశలో ఉన్నాయి.

  • Loading...

More Telugu News