Amazon: ఏప్రిల్ 20 నుంచి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సైట్లలో అమ్మకాలు... ఈ వస్తువులు మాత్రమే!
- ఎలక్ట్రానిక్ ఉపకరణాల అమ్మకాలకు అనుమతి
- తాజా మార్గదర్శకాలు వెల్లడించిన కేంద్ర హోంశాఖ
- ఈ-కామర్స్ సంస్థలు ప్రత్యేక అనుమతులు తీసుకోవాలని స్పష్టీకరణ
కరోనా రక్కసి ప్రభావంతో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లు సైతం నిలిచిపోయాయి. ప్రపంచాన్నే ఓ చిల్లర అంగడిగా మార్చిన ఈ-కామర్స్ సంస్థలు లాక్ డౌన్ దెబ్బకు స్థంభించిపోయాయి. అయితే, వినియోగదారులకు ఊరటనిచ్చేలా ఈ నెల 20 నుంచి అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ వంటి పోర్టళ్లు తమ కార్యకలాపాలు కొనసాగించనున్నాయి. అయితే, పూర్తిస్థాయిలో విక్రయాలకు మరికొంత సమయం పడుతుందని, ప్రస్తుతానికి మొబైల్ ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్ టాప్ ల వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, స్టేషనరీ వస్తువులు మాత్రమే విక్రయించేందుకు అనుమతిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
మే 3వ తేదీ వరకు రెండో దశ లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో, కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాల్లోనే ఈ-కామర్స్ అమ్మకాల అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఈ క్రమంలో ఈ-కామర్స్ సంస్థలు తమ వాహనాలను రోడ్లపైకి తీసుకువచ్చేందుకు తగిన అనుమతులు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.