Corona Virus: ప్రత్యేక రోబోతో కరోనా రోగులకు ఆహారం, మందులు సరఫరా.. అభివృద్ధి చేసిన ఐఏఎస్ అధికారి!
- అభివృద్ధి చేసిన జార్ఖండ్ ఐఏఎస్ అధికారి ఆదిత్య రంజన్
- 30 కిలోలతో 200 అడుగుల వరకూ వెళ్లే ప్రత్యేక వాహనం
- రిమోట్‌తో ఆపరేట్ చేసేలా రూపొందించిన అధికారి
కరోనా వైరస్ సోకిన రోగులతో పాటు వైరస్ లక్షణాలు ఉన్న వారికి వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో వారికి కూడా వైరస్ సోకే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో మానవ ప్రమేయం లేకుండా కరోనా రోగులకు ఆహారం, ఔషధాలు అందించడం కోసం జార్ఖండ్ ఐఏఎస్ అధికారి ఆదిత్య రంజన్ ఓ ప్రత్యేక రోబోను అభివృద్ధి చేశారు. ‘కో బోట్’ పేరుతో రూపొందించిన ఈ వాహనం.. కరోనా రోగులు, క్వారంటైన్‌లో ఉన్న వారికి స్వయంగా ఆహారం, మందులు అందిస్తుంది. ఆ విధంగా దాని ద్వారా కరోనా పేషెంట్లతో వైద్యులు, నర్సులు, మెడికల్ స్టాఫ్ ఎక్కువసార్లు కలవడాన్ని తగ్గించుకోవచ్చు.
రిమోట్‌తో పని చేసే ఈ రోబో 30 కిలోల బరువును మోస్తుంది. దీన్ని 200 అడుగుల వరకూ ఆపరేట్ చేయొచ్చు. ఈ వాటర్ ప్రూఫ్ వాహనానికి వైఫై కెమెరా, మైక్రోఫోన్ ఏర్పాటు చేశారు. దాని వల్ల రెండు వైపుల నుంచి సమాచారం ఇవ్వొచ్చు. అంటే.. ఆహారం, మందులు పంపించే వైద్యులు రోగులతో మాట్లాడొచ్చు. అలాగే, రోగులు కూడా వైద్యులకు ఏదైనా చెప్పొచ్చు. రోగులకు తరచూ అవసరం అయ్యే ఆహారం, నీళ్లు, మందులు దీని ద్వారా అందించి వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
చైబాస నగర డిప్యూటీ కమిషనర్ గా పని చేస్తున్న ఆదిత్య రంజన్.. ఇదివరకే అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఐసోలేషన్ బెడ్ (ఐ బెడ్) రూపొందించారు. కరోనాతో తీవ్రంగా బాధపడుతున్న రోగుల నుంచి సాధారణ రోగులకు వైరస్ సోకకుండా ఉండేందుకు దాదాపు 50 బెడ్లను ఆయన ఏర్పాటు చేశారు. అంతకుముందు షీల్డింగ్ మాస్కులతో పాటు ‘ఫోన్ బూత్ శాంపిల్ కలెక్షన్’ టెక్నాలజీని కూడా ఆయనే ప్రవేశ పెట్టారు. ఫోన్ బూత్ టెక్నాలజీలో.. టెక్నీషియన్ ఓ బూత్‌లో నిల్చుంటాడు. అవతలి వైపు శాంపిల్ ఇవ్వాల్సిన వ్యక్తి ఉంటాడు. ఇద్దరి మధ్య ఉన్న గ్లాసుకు రెండు రంద్రాలు ఉంటాయి. వాటి నుంచి చేతులను బయటపెట్టి.. టెక్నీషియన్ శాంపిల్స్ సేకరిస్తాడు. ఆదిత్య ఐఐటీ పట్టభద్రుడు. ఆయనకు రోబోటిక్స్‌పై ఆసక్తి ఎక్కువ.