Kamal Haasan: ఇది టైమ్ బాంబ్ వంటిది.. కరోనా కంటే సమస్య పెద్దది కాకముందే నిర్వీర్యం చేయాలి: కమలహాసన్
- ముంబై బాంద్రా స్టేషన్ వద్దకు చొచ్చుకొచ్చిన వలస కార్మికులు
- వలస కార్మికుల సమస్య టైమ్ బాంబ్ వంటిదన్న కమల్
- క్షేత్ర స్థాయిలో జరిగుతుదాన్ని ప్రభుత్వాలు గమనించాలని సూచన
ఇండియా లాక్ డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా వలస కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ వారి సొంత ఊళ్లకు చేరుకునే క్రమంలో, ఇప్పటికే కొందరు ప్రాణాలను కూడా కోల్పోయారు.
మరోవైపు లాక్ డౌన్ ను మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించడంతో... వలస కార్మికుల ఆందోళన మరింత పెరిగింది. ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ వద్దకు ఇతర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది వలస కార్మికులు చొచ్చుకొచ్చిన సంగతి తెలిసిందే. తమ స్వస్థలాలకు పంపించాలంటూ వారంతా ఆందోళనకు దిగారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీ ఛార్జి చేయాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో సినీ నటుడు, మక్కల్ నీదీ మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'బాల్కనీల్లో ఉన్నవాళ్లు క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోందో నిశితంగా గమనించండి. తొలుత ఢిల్లీకి పరిమతమైన ఈ సమస్య... ఇప్పుడు ముంబైకి పాకింది. వలస కార్మికుల సమస్య ఒక టైమ్ బాంబ్ వంటిది. కరోనా కంటే ఈ సమస్య పెద్దది కాకముందే దాన్ని నిర్వీర్యం చేయాలి. గ్రౌండ్ లో ఏం జరుగుతోందే బాల్కనీ ప్రభుత్వాలు పరిశీలించాలి' అని కమల్ సూచించారు.