America: ప్రపంచవ్యాప్తంగా 20 లక్షలకు చేరువైన కరోనా కేసులు.. అమెరికాలో నెమ్మదించిన వైరస్!

World wide Corona Cases Nearer to 20 lakhs

  • 1.26 లక్షలు దాటిన మరణాలు
  • యూరప్‌లో తగ్గుముఖం పడుతున్న వైరస్ ప్రభావం
  • రష్యాలో నిన్న ఒక్క రోజే 2500కుపైగా పాజిటివ్ కేసుల నమోదు

ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులు 20 లక్షలకు చేరువయ్యాయి. ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1.26 లక్షలు దాటింది. అడ్డుఅదుపు లేకుండా చెలరేగిపోతున్న ఈ వైరస్ బారినపడి దేశాలు అల్లాడిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు యూరప్ దేశాలతోపాటు అమెరికాను కుదిపేసిన ఈ ప్రాణాంతక వైరస్ అక్కడ కొంత నెమ్మదించగా, ఇప్పుడు రష్యాను కలవరపెడుతోంది.

అమెరికాలో 6.14 లక్షల మందికిపైగా ఈ వైరస్‌కి చిక్కగా, 26 వేల మందికిపైగా మృతి చెందారు. కోవిడ్ కేసుల్లోనూ, మరణాల్లో అమెరికాదే అగ్రస్థానం. ఇక్కడ గత 24 గంటల్లోనే 24,895 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతుండడం ఊరటనిచ్చే విషయం. వైరస్‌ను అదుపు చేసేందుకు తాము తీసుకుంటున్న చర్యలు ఫలితాన్నిస్తున్నట్టు అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు, న్యూయార్క్‌ను అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ఇప్పుడు అక్కడ కూడా నెమ్మదించింది. గడ్డు పరిస్థితుల నుంచి బయటపడుతున్నట్టు ఆ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ క్యూమో పేర్కొన్నారు.

కరోనా కోరల్లో చిక్కి నిన్న ఇటలీలో 600 మంది, స్పెయిన్‌లో 567 మంది మరణించారు. ఈ దేశాల్లోనూ కొత్త కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇరాన్‌లో వైరస్ ప్రభావం గణనీయంగా తగ్గింది. అక్కడ ఇప్పటి వరకు 4,683 మంది మృతి చెందారు. ఇటలీలో 21,067 మంది, స్పెయిన్‌లో 18,255 మంది ప్రాణాలు కోల్పోగా, యూకేలో ఇప్పటి వరకు 12,107 మంది మృత్యువాత పడ్డారు. రష్యాలో నిన్న ఒక్క రోజే 2500కుపైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 170 మంది ప్రాణాలు విడిచారు.

America
Europe countries
Corona Virus
Russia
  • Loading...

More Telugu News