WHO: ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులను నిలిపివేస్తూ, ట్రంప్ కఠిన నిర్ణయం!

Trump Halts WHO Funds

  • కొన్ని దేశాలకు పక్షపాతిగా వ్యవహరిస్తోందన్న ట్రంప్ 
  • మిగులు నిధి ఎలా సద్వినియోగం చేయాలన్న విషయమై ఆలోచన
  • ఆర్థిక వనరులు తగ్గించే సమయం కాదన్న ఐరాస

కరోనా మహమ్మారి విపత్తు వ్యవహారంలో సరిగ్గా వ్యవహరించకుండా, కొన్ని దేశాల పట్ల పక్షపాతిగా వ్యవహరించిందని ఆరోపిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కు అమెరికా నుంచి అందుతున్న నిధులను నిలిపివేస్తున్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇక ఆ మిగులు నిధులను ఎలా సద్వినియోగం చేయాలన్న విషయమై ఆలోచనలు చేస్తామని ఆయన తెలిపారు.

ఆర్థిక ఇబ్బందులు పడుతున్న దేశాలను ఆదుకోవాలని డబ్ల్యూహెచ్ఓ భావించడం లేదని ఆరోపించిన ఆయన, కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రపంచానికి సరైన సమయంలో సమాచారాన్ని అందించలేదని మండిపడ్డారు. చైనా నుంచి వచ్చిన సమాచారాన్ని వచ్చినట్టుగా చెప్పిందే తప్ప, ఏ మాత్రమూ వాస్తవ పరిస్థితులను డబ్ల్యూహెచ్ఓ అంచనా వేయలేదని ఆరోపించిన డొనాల్డ్ ట్రంప్, వారిచ్చిన తప్పుడు సమాచారం కారణంగానే, కరోనా కేసుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 20 రెట్లు పెరిగిందని అన్నారు. ఇకపై ఆ సంస్థకు తమ నుంచి నిధులు అందబోవని స్పష్టం చేశారు.

కాగా, గత సంవత్సరం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు అమెరికా 400 మిలియన్ డాలర్ల నిధులను అందించింది. ఇక అమెరికా తీసుకున్న నిర్ణయంపై స్పందించిన ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్, ఆర్థిక వనరులను తగ్గించడానికి ఇది సరైన సమయం కాదని అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ పై పోరాడి గెలవాల్సిన పరిస్థితిలో ప్రపంచం ఉందని, ఇందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని తెలిపారు. కాగా, స్పెయిన్ లో లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తూ, కొన్ని ఫ్యాక్టరీలు, నిర్మాణ రంగానికి అనుమతించిన ఒక రోజు తరువాత ఆస్ట్రియా, ఇటలీ దేశాల్లో కూడా కొన్ని షాప్ లు తిరిగి తెరచుకున్నాయి. ఫ్రాన్స్ లో మాత్రం మరో నెల రోజుల పాటు నిబంధనలు అమలు కానున్నాయి.

WHO
Funds
Donald Trump
UNO
  • Loading...

More Telugu News