Andhra Pradesh: ఏపీలో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల విడుదల.. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు!

Jagan Releases Fees Reimbersment for Students

  • 2018 విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు
  • 2019 డిసెంబర్ వరకూ బకాయిల విడుదల
  • వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లి ఖాతాలోకే డబ్బు
  • కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీ సీఎం జగన్

ఏపీలోని విద్యార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభవార్త చెప్పారు. 2018-19 విద్యా సంవత్సరానికి చెందిన రూ. 1,800 కోట్ల రీయింబర్స్ మెంట్ బకాయిలతో పాటు 2019-20 సంవత్సరానికి సంబంధించిన తొమ్మిది నెలల కాలానికి చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేస్తున్నట్టు తెలిపారు. అలాగే ఫీజు రీయింబర్స్ మెంట్ పై కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఈ ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ రీయింబర్స్ మెంట్ మొత్తాన్ని విద్యార్థినీ విద్యార్థుల తల్లి బ్యాంకు ఖాతాలోకే నేరుగా వేయనున్నామని సీఎం తెలిపారు. ఇక, గత ప్రభుత్వం రూ. 35000 ఫీజు రీయింబర్స్ మెంట్ గరిష్ట పరిమితిని పెట్టడంతో, మిగతా ఫీజు మొత్తాన్ని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఆయా కాలేజీ యాజమాన్యాలు వసూలు చేశాయి. అలా వసూలు చేసిన అదనపు మొత్తాన్ని ఆయా విద్యార్థులకు తిరిగి ఇచ్చేయాలని, కాలేజీలను ఆదేశిస్తూ, ఆ బకాయిలను కూడా ప్రభుత్వం కాలేజీలకు విడుదల చేసింది.

ఇందుకు సంబంధించి 191 కాలేజీలకు ఆదేశాలు ఇప్పటికే ఇచ్చామని, వారి నుంచి విద్యార్థుల తల్లిదండ్రులకు సక్రమంగా డబ్బు అందేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని వీడియో కాన్ఫరెన్స్ లో జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించని కాలేజీలపై చర్యలుంటాయని, వాటిని బ్లాక్ లిస్టులో పెట్టేందుకు వెనుకాడవద్దని ముఖ్యమంత్రి సూచించినట్టు విద్యా శాఖ అధికారులు వెల్లడించారు.

Andhra Pradesh
Jagan
Fee Reimbersment
Video Conference
  • Loading...

More Telugu News