Chandrababu: నిన్న ప్రధాని కార్యాలయానికి ఫోన్ చేసి ఆయనతో మాట్లాడాలని కోరా.. ఈ రోజు ఆయనే నాకు ఫోన్ చేశారు!: చంద్రబాబు 

chandrababu on corona virus

  • ఈ రోజు ఉదయం 8.30 గంటలకు మోదీ నాకు ఫోను చేసి మాట్లాడారు
  • నా ఆలోచనలను ఆయనకు చెప్పాను
  • కరోనాను కొన్ని రాష్ట్రాలు కట్టడి చేయలేకపోతున్నాయి 

కరోనా కట్టడికి పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... 'లాక్‌డౌన్‌ అంశం ఆర్ధిక వ్యవస్థకు పెను సవాలుగా మారింది. ఇదే సమయంలో ప్రజల ప్రాణాలు ముఖ్యం. అందుకే ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారు' అని చెప్పారు.

'కొన్ని రాష్ట్రాలు కరోనాను సమర్థవంతంగా కట్టడి చేస్తున్నాయి.. మరికొన్ని కట్టడి చేయలేకపోతున్నాయి. ముందు జాగ్రత్తలు తీసుకోవడమే సమస్యకు పరిష్కారం. నిబంధనలకు పకడ్బందీగా అమలు చేయాలి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రజలు వెళ్లకుండా చూడాలి' అని చెప్పారు.

'అనుమానితుల నమూనాలు తీసుకుని పరీక్షించడం మన రాష్ట్రంలో తగ్గాయి. ల్యాబ్‌లు పెంచుకుని ఎక్కువ మంది నుంచి నమూనాలు సేకరించాలి. ఎక్కువగా నమూనాలు తీసుకుంటే దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవచ్చు. కంటికి కనిపించని శత్రువు కరోనా. లాక్‌డౌన్‌తో కొంతవరకు కట్టడి చేయగలుగుతున్నాం' అని చెప్పారు.

ఈ రోజు ఉదయం మోదీ ఫోన్ చేశారు..

'ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నప్పుడు మన తెలివి తేటలను, సూచనలు పంచుకోవాలి. నేను నిన్న ప్రధాని కార్యాలయానికి ఫోన్ చేసి ఆయనతో మాట్లాడాలని కోరా .. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చేసిన ఫోనుకి ప్రతి స్పందిస్తూ ఈ రోజు ఉదయం 8.30 గంటలకు మోదీ నాకు ఫోను చేసి మాట్లాడారు. నా ఆలోచనలను ఆయనకు చెప్పాను' అని చంద్రబాబు తెలిపారు.

'కరోనా దేశంలో ప్రవేశించినప్పటి నుంచి ప్రధాని మోదీ అనేక చర్యలు తీసుకున్నారు. విమాన ప్రయాణాలపై నిషేధం విధించారు. మాజీ రాష్ట్రపతులు, ప్రధానులు, ప్రతిపక్ష పార్టీల నేతలు అందరితోనూ మాట్లాడారు.. ఇది చాలా ముఖ్యం' అని చంద్రబాబు అన్నారు.

'నాకు అన్నీ తెలుసు, ఎవరి సూచనలూ తీసుకునే అవసరం లేదనే అహంకారం ఏ నాయకుడిలోనూ ఉండకూడదు. కరోనాపై అందరి సలహాలు సూచనలు తీసుకోవాలి. కరోనాపై వీరోచితంగా పోరాడాలి. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటూ లాక్‌డౌన్‌ నిబంధనలు మాట్లాడాలి' అని చంద్రబాబు చెప్పారు.

  • Loading...

More Telugu News