AIIMS: కరోనా వైరస్ పెంపుడు జంతువుల నుంచి వ్యాపిస్తుందనడానికి ఆధారాల్లేవు: ఎయిమ్స్
- ప్రపంచవ్యాప్తంగా మృత్యుఘంటికలు మోగిస్తున్న కరోనా
- జంతువుల ద్వారా కూడా సోకుతుందని అపోహలు
- ఇది మనిషి నుంచి మాత్రమే మనిషికి సోకుతుందన్న ఎయిమ్స్ డైరెక్టర్
కరోనా వైరస్ భూతం ప్రపంచ మానవాళికి పెనుముప్పుగా పరిణమించింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలో ఈ వైరస్ తో తీవ్ర పోరాటం సాగిస్తున్నాయి. ఇది గాలి ద్వారా వ్యాపించే వ్యాధి కాదు. అయినప్పటికీ మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తూ పలు దేశాల్లో మృత్యుఘంటికలు మోగిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఆసక్తికర అంశాలు వెల్లడించారు.
కరోనా వైరస్ మనుషుల్లోనూ, జంతువుల్లోనూ కనిపిస్తోందని, అయితే జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందనడానికి ఎలాంటి ఆధారాల్లేవని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఉన్న ఆధారాల ప్రకారం కరోనా వైరస్ మనిషి నుంచి మనిషికి సోకుతుందని తేలిందని వివరించారు. గతంలో వచ్చిన మెర్స్, సార్స్ వైరస్ లు జంతువుల నుంచి మనుషులకు సోకడం ద్వారా రూపాంతరం చెందాయని, కానీ కరోనా వైరస్ ప్రధానంగా మానవులకి చెందిన వైరస్ అని, ఇది మనిషి నుంచి మాత్రమే మనిషికి వ్యాపిస్తుందని తెలిపారు.
పెంపుడు జంతువుల నుంచి మనుషులకే ఈ వైరస్ సోకే అవకాశాలు దాదాపుగా లేవని అన్నారు. అందువల్ల పెంపుడు జంతువులను ఇంట్లో ఉంచుకున్నందు వల్ల ఎలాంటి ఇబ్బందిలేదని స్పష్టం చేశారు. కరోనా కారణంగా భయానక పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎంతోమంది తమ పెంపుడు జంతువులను దూరంగా వదిలేస్తున్న నేపథ్యంలో డాక్టర్ రణదీప్ గులేరియా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.