Tiktok: తల్లికి ఔషధాల కోసం యువతి టిక్ టాక్... వెంటనే స్పందించిన కర్ణాటక సీఎం!
- మహిళకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ అపరేషన్
- 20 రోజులుగా మందులు లేక క్షీణించిన ఆరోగ్యం
- టిక్ టాక్ వీడియో చూసి యడియూరప్ప స్పందన
- నెల రోజుల మెడిసిన్స్ ను ఇంటికి చేర్చిన అధికారులు
తన తల్లికి కావాల్సిన ఔషధాలను లాక్ డౌన్ కారణంగా కొనుగోలు చేయలేకపోతున్నానని ఓ యువతి చేసిన టిక్ టాక్ వీడియోను చూసిన కర్ణాటక సీఎం యడియూరప్ప, వెంటనే స్పందించారు. ఈ ఘటన బెళగావి జిల్లా రాయదుర్గ తాలూకా, నరసాపుర గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే, ఇక్కడి శేఖవ్వ అనే మహిళ రెండు కిడ్నీలూ పాడవడంతో, ఆమె భర్త ఓ కిడ్నీని దానం ఇచ్చారు. జనవరిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. ఆపై ఆమె ఇంట్లో మెడిసిన్స్ తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటోంది.
ఇదే సమయంలో గడచిన 20 రోజులుగా శాఖవ్వకు కావాల్సిన మందులు దొరకని పరిస్థితి ఏర్పడటంతో, ఆమె ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఆమె కుమార్తె పవిత్ర, తల్లి బాధను చెబుతూ, టిక్ టాక్ వీడియో చేసింది. ఈ వీడియో వైరల్ అయి, యడియూరప్పను చేరగా, ఆయన సూచనతో, జిల్లా అధికారులు నిన్న శాఖవ్వ ఇంటికి వెళ్లారు. నెల రోజులకు సరిపడా మందులను అందించారు. మరేదైనా సమస్య ఏర్పడితే, తమకు తెలియజేయాలని సూచించారు.