Krishnamachari Srikant: ఐపీఎల్ జరుగకుంటే ధోనీ 'ఖేల్' ఖతమే: కృష్ణమాచారి శ్రీకాంత్
- ధోనీ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు దాదాపు లేనట్టే
- వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ కే నా మద్దతు
- జట్టు ప్రయోజనాలకే పెద్ద పీటన్న సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్
ఈ సంవత్సరం ఐపీఎల్ పోటీలు జరుగకుంటే, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, టీ-20 వరల్డ్ కప్ కు ఎంపికై, మరోసారి దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాలు దాదాపు మృగ్యమేనని సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. శనివారం నాడు ఓ టీవీ చానెల్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ధోనీ విషయంలో తాను ఆచితూచి మాత్రమే స్పందించాలని భావించడం లేదని, ఐపీఎల్ పోటీలు రద్దయితే, అతనికి తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు అత్యంత స్వల్పమేనని వ్యాఖ్యానించారు.
"నేనే ప్రస్తుతం సెలక్షన్ కమిటీ చైర్మన్ గా ఉన్నట్లయితే, నేనేం చేస్తానన్న విషయాన్ని మాత్రమే చెబుతున్నాను" అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, గత సంవత్సరం జూలైలో వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా, న్యూజిలాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ అనంతరం, ధోనీ మరోమారు ప్యాడ్స్ కట్టుకుని బరిలోకి దిగలేదన్న సంగతి తెలిసిందే. ఇక భారత క్రికెట్ టీమ్ ఎంపిక వ్యక్తులను చూసి జరుగబోదని, జట్టు ప్రయోజనాలే ముఖ్యమని 1983లో భారత క్రికెట్ జట్టు ఆటగాడిగా, వరల్డ్ కప్ గెలిచిన టీమ్ సభ్యుడిగా ఉన్న శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత పరిస్థితుల్లో వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మెన్ గా రిషబ్ పంత్ సరిగ్గా సరిపోతాడని, కేఎల్ రాహుల్ సైతం తన మదిలో ఉన్నాడని తెలిపిన శ్రీకాంత్ తానైతే రిషబ్ వైపే మొగ్గుచూపుతానని, అతనిలో టాలెంట్ ఎంతో ఉండటమే ఇందుకు కారణమని అన్నారు. ఐపీఎల్ పోటీలు జరుగకుంటే, అసలు ధోనీ పేరు తన మనసులోకే రాదని స్పష్టం చేశారు.