KCR: తెలంగాణలో ఈ నెల 30 వరకు లాక్ డౌన్: సీఎం కేసీఆర్

cm kcr tells Lock down extended in Telangana

  • తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 503
  • 14 మంది చనిపోయారన్న కేసీఆర్
  • కంటైన్ మెంట్ జోన్లలో పరిస్థితి అదుపులోనే ఉందని వెల్లడి

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన సీఎంల వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. అనంతరం ప్రగతి భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి కూడా తెలిపామని, తాము క్యాబినెట్ భేటీలో నిర్ణయించిన మేరకు కేంద్రానికి విజ్ఞాపన పత్రాన్ని పంపిస్తున్నామని వివరించారు.

ఇక రాష్ట్రంలో కరోనా పరిస్థితుల గురించి చెబుతూ, తొలి దశలో 25,937 మందిని క్వారంటైన్ లో ఉంచామని, ఇప్పుడు వాళ్లందరూ వెళ్లిపోయారని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 503 అని, వారిలో 14 మంది చనిపోయారని వివరించారు. 96 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారని చెప్పారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 393 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇతర దేశాల నుంచి వచ్చిన 34 మందికి, వారితో సన్నిహితంగా మెలిగినవారికి కరోనా సోకిందని అన్నారు. ప్రస్తుతం క్వారంటైన్ లో 1654 మంది ఉన్నారని, రాష్ట్రవ్యాప్తంగా 243 ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు ఉంటాయని తెలిపారు. భగవంతుడి దయ వల్ల కంటైన్ మెంట్ జోన్లలో ఉన్న ఎవరికీ విషమ పరిస్థితి లేదని వెల్లడించారు.

ఏప్రిల్ 24 నాటికి రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నిలిచిపోతుందని భావిస్తున్నామని, మళ్లీ ఏదైనా ఉత్పాతం జరిగితే తప్ప అప్పటివరకు ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని అన్నారు. అయితే మహారాష్ట్రలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని, మహారాష్ట్రతో తెలంగాణకు సుదీర్ఘమైన సరిహద్దు ఉండడంతో వైరస్ వ్యాప్తి నిరోధానికి గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అన్ని మతాల వారు సామూహికంగా ఒక్క చోట చేరే కార్యక్రమాలను నిలిపివేయాలని హితవు పలికారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేయాలని క్యాబినెట్ భేటీలో నిర్ణయించామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News