Raghuram Rajan: కోరితే మాంద్యం నుంచి గట్టెక్కేందుకు సలహాలిస్తా... ఇండియాకు రఘురామ్ రాజన్ ఆఫర్!
- ఇండియాలో తీవ్రమవుతున్న ఆర్థిక సంక్షోభం
- వృద్ధి రేటు గణనీయంగా తగ్గుతుందంటున్న రీసెర్చ్ సంస్థలు
- 2021లోనే రికవరీ సాధ్యమన్న రఘురామ్ రాజన్
లాక్ డౌన్ వేళ, ఇండియాలోని పరిశ్రమలన్నీ మూతపడగా, ఆ ప్రభావం ఆర్థిక సంక్షోభానికి కారణమై, జీడీపీని ప్రభావితం చేస్తున్న వేళ, కోరితే, తాను మాంద్యం నుంచి గట్టెక్కేందుకు తనకు తోచిన సలహాలు, సూచనలు ఇస్తానని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలతో వృద్ధి రేటు గణనీయంగా పతనమవుతోందని ఇప్పటికే పలు రీసెర్చ్ సంస్థలు అంచనాలు వేసిన సంగతి తెలిసిందే. అత్యవసర, నిత్యావసరాల సేవలు మినహా మరేమీ అందని పరిస్థితి నెలకొంది.
ఇక ఇదే విషయమై ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడిన రఘురామ్ రాజన్, భారత్ కు సలహాలిస్తారా? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ, "నా నుంచి సమాధానం నేరుగా అవుననే వస్తుంది. ఇండియా కోరుకుంటే, నా వంతు సాయం చేసేందుకు సిద్ధం. ఇటలీ, యూఎస్ లో వైరస్ విస్తరించిన తీరును చూసిన తరువాత, మనం చాలా సీరియస్ గా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజల ఆరోగ్యంపై ఈ మహమ్మారి తీవ్రమైన ప్రభావం చూపింది. ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. ఎన్నో మరణాలు సంభవిస్తున్నాయి. ఆర్థిక వృద్ధిని ముందడుగు వేయించడం ఈ పరిస్థితుల్లో చాలా కష్టం" అని రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే పెను మాంద్యం దిశగా ప్రపంచం అడుగులు వేస్తోందని వ్యాఖ్యానించిన ఆయన, వచ్చే సంవత్సరంలోనే రికవరీ ఉంటుందని ఆశించవచ్చని, అప్పటివరకూ కష్టకాలమేనని భావిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతానికి మహమ్మారిని అణచివేయడంపైనే దృష్టిని సారించాలని సూచించారు.
"ఇండియాలో తొలి ప్రభావం విదేశీ మారక నిల్వలపై పడింది. మిగతా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో పోలిస్తే రూపాయి విలువ స్థిరంగానే నిలిచినట్టుగా భావించవచ్చు. ఆర్బీఐ నుంచి అందిన మద్దతే ఇందుకు కారణం. డాలర్ తో రూపాయి విలువ క్షీణించినా, మన పరిస్థితి బాగానే ఉంది. బ్రెజిల్ వంటి దేశాల కరెన్సీ విలువ 25 శాతం పడిపోయింది" అని రాజన్ గుర్తు చేశారు.
కాగా, ఇండియాలో నోట్ల రద్దు సమయంలో నరేంద్ర మోదీ ఆలోచనలతో విభేదించిన రఘురామ్ రాజన్, ఆపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.