Zoom: కలిసొచ్చిన కరోనా... రాకెట్ లా దూసుకుపోయిన జూమ్ యాప్ సీఈఓ సంపద

Due to corona situations Zoom App ceo Eric Yuan net worth skyracketed

  • 3 నెలల్లో రూ.30,000 కోట్లు పెరుగుదల
  • 8 బిలియన్ డాలర్లకు చేరిన సంపద
  • 200 మిలియన్ డౌన్ లోడ్లతో జూమ్ యాప్ ప్రభంజనం

కరోనా భూతం విజృంభించడంతో ప్రపంచమే ఇంటికి పరిమితమైంది. దాంతో అనేక సంస్థల కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జూమ్ యాప్ ఎంతో ఉపయుక్తంగా మారింది. ఈ యాప్ సాయంతో 50 మంది వరకు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనే అవకాశం ఉండడంతో వర్క్ ఫ్రమ్ హోం విధానంలో విధులు నిర్వర్తిస్తున్నవారికి ఇదొక అద్భుతమైన యాప్ అయింది. దాంతో ఈ యాప్ డౌన్ లోడ్లు రాకెట్ లా దూసుకుపోయాయి. మార్చిలో ఓ వారం రోజుల్లో జూమ్ యాప్ ను 62 మిలియన్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఈ పరిణామాలతో జూమ్ యాప్ సీఈఓ ఎరిక్ యువాన్ ఆస్తి విలువ భారీగా పెరిగింది.

కొన్నినెలల క్రితం 3.5 బిలియన్ డాలర్లుగా ఉన్న యువాన్ సంపద కరోనా ప్రభావం పుణ్యమా అని 8 బిలియన్ డాలర్లకు చేరింది. 2019 డిసెంబరులో జూమ్ యాప్ డౌన్ లోడ్లు 10 మిలియన్లు కాగా, 2020 మార్చి నాటికి ఆ సంఖ్య 200 మిలియన్లకు చేరింది. దాంతో యువాన్ సంపద మూడు నెలల్లోనే సుమారు రూ.30,000 కోట్లు పెరిగింది.

ఇదే కాలవ్యవధిలో ఇతర సంస్థలు కరోనా దెబ్బకు కుదేలవగా, జూమ్ యాప్ మాత్రం తిరుగులేని విధంగా దూసుకుపోతోంది. ప్రపంచంలో ఎక్కడున్నా, భారీ సంఖ్యలో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనే సదుపాయం, లాగిన్ అయ్యే అవసరం లేకపోవడం జూమ్ పట్ల విశేషాదరణకు కారణాలు.

అయితే, జూమ్ నుంచి వీడియో కాల్ డేటా ఫేస్ బుక్ కు వెళుతోందని ఆరోపణలు వస్తున్నాయి. యూజర్ల అనుమతి లేకుండానే, కనీసం ఫేస్ బుక్ అకౌంట్ లేని వ్యక్తికి సంబంధించిన సమాచారం కూడా ఫేస్ బుక్ కు వెళుతోందని, ముఖ్యంగా ఐఓఎస్ ప్లాట్ ఫామ్ పై జూమ్ యాప్ వినియోగిస్తున్నవారికి ఈ సమస్య ఎక్కువగా ఉందని ఫిర్యాదులు చేస్తున్నారు.

దీనిపై జూమ్ యాప్ సీఈఓ యువాన్ స్పందిస్తూ, ఈ సమస్యలను మూడు నెలల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు, జూమ్ యాప్ ద్వారా వీడియో కాల్ మాట్లాడుతుంటే, మధ్యలో అపరిచితులు కూడా వస్తున్నారంటూ ఫిర్యాదులు రావడం తెలిసిందే. ఏదేమైనా, ఇవన్నీ పట్టించుకోకుండా జూమ్ యాప్ అంటే నెటిజన్లు భారీగా ఎగబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News