vijay malya: విజయ్ మాల్యాకు భారీ ఊరట... ఎస్బీఐ పిటిషన్ ను విచారణకు స్వీకరించేది లేదన్న లండన్ హైకోర్టు!
- దివాలా తీసినట్టు ప్రకటించాలని కోరిన బ్యాంకులు
- మాల్యాకు కొంత సమయం ఇవ్వాలన్న న్యాయమూర్తి
- బ్యాంకుల పిటిషన్ పై ప్రస్తుతం ఆదేశాలు ఇవ్వలేమని తీర్పు
ఇండియాలోని బ్యాంకులకు వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా, బ్రిటన్ పారిపోయి, అక్కడే తలదాచుకున్న యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యాకు లండన్ హైకోర్టు భారీ ఊరటను ఇచ్చింది. మాల్యా సంస్థలు తమనుంచి తీసుకున్న రుణాలను రికవరీ చేసేందుకు వీలును కల్పిస్తూ, ఆయన సంస్థలు దివాలా తీసినట్టుగా ఆదేశాలు ఇవ్వాలని ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్టియం వేసిన పిటిషన్ విచారణను న్యాయమూర్తి పక్కన పెట్టారు.
ఈ మేరకు లండన్ హైకోర్టు ఇన్ సాల్వెన్సీ డివిజన్ న్యాయమూర్తి మైఖేల్ బ్రిగ్స్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఇప్పటికే దాఖలు చేసిన పలు పిటిషన్లు భారత సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉన్నాయని, కర్ణాటక హైకోర్టులో సెటిల్ మెంట్ ప్రపోజల్స్ పై విచారణ జరుగుతోందని, వీటి విషయంలో తీర్పులు రాకుండా నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేశారు.
బ్యాంకులకు నిధులను చెల్లించే విషయమై ఆయన వ్యూహం ఏంటో వెల్లడించేందుకు అవసరమైన సమయం ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ సమయంలో బ్యాంకులు వేసిన పిటిషన్ విచారణార్హం కాదని అన్నారు. ఈ విషయంలో భారత బ్యాంకులు ఎందుకు తొందర పడుతున్నాయో తెలియడం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు.
కోర్టులేమీ బ్యాంకులకు అన్యాయం చేయబోవని, అయితే, ప్రస్తుతానికి బ్యాంకులు దాఖలు చేసిన పిటిషన్ ను పక్కన పెట్టాల్సిందేనని, ఆయన రుణం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతున్న వేళ, కొంత సమయం ఇచ్చి చూద్దామని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కాగా, ఎస్బీఐ కన్సార్టియం, గత సంవత్సరమే తన పిటిషన్ ను దాఖలు చేయగా, ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, తన తీర్పును వాయిదా వేసి ఉంచిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో జూన్ 1 తరువాత తదుపరి వాదనలు వింటామని కూడా ఆయన స్పష్టం చేశారు.