Dwaraka Tirumala Rao: ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్లందరినీ ట్రేస్ చేశాం: విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు
- ‘కరోనా’ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తించాం
- ఈ ప్రాంతాల్లో 24 గంటలు కర్ప్యూ అమల్లో ఉంటుంది
- లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాం
ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్లందరినీ ట్రేస్ చేశామని, ఆ వ్యక్తులతో పాటు వారితో కాంటాక్టు ఉన్న వారినీ క్వారంటైన్ కు తరలించామని విజయవాడ పోలీస్ కమిషనర్ (సీపీ) ద్వారకా తిరుమలరావు తెలిపారు. ‘కరోనా’ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించామని చెప్పారు. నగరంలో ఆరు ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తించామని, ఈ ప్రాంతాల్లో 24 గంటలు కర్ప్యూ అమల్లో ఉంటుందని అన్నారు.
లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామని, ఈ నిబంధనలు ఉల్లంఘించిన ఏడు వందల మంది వాహనదారులపై కేసులు నమోదయ్యాయని అన్నారు. కేవలం, కేసులు నమోదు చేసి వదిలివేయడం లేదని తర్వాత విచారణ ఉంటుందని తెలిపారు. లాక్ డౌన్ నిబంధనలను అందరూ పాటించాలని, ముఖ్యంగా యువత ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. క్వారంటైన్ ను శిక్షగా భావించొద్దని సూచించారు.