Pawan Kalyan: చిరంజీవి పోస్ట్ చేసిన హనుమంతుడి ఫొటోపై ఆసక్తికర విషయం చెప్పిన పవన్ కల్యాణ్!
- మా ఇంట్లో హనుమ ఆరాధన చిరంజీవిగారి వల్లే అలవాటైంది
- నాన్నను నాస్తిక, కమ్యూనిస్టు భావాల నుంచి రాముడి భక్తుడిగా మార్చింది
- నా టీనేజ్‌లో ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా చదివేవాడిని
హనుమజ్జయంతి సందర్భంగా హనుమంతుడి ఫొటో పోస్ట్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి పలు విషయాలు తెలిపిన సంగతి విదితమే. 'ఈ రోజు హనుమజ్జయంతి. ఆంజనేయస్వామితో నాకు చాలా అనుబంధం ఉంది.. చిన్నప్పటి నుంచి. 1962లో నాకు ఓ లాటరిలో ఈ బొమ్మ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ బొమ్మ నా దగ్గర అలాగే భద్రంగా ఉంది. ఉంది అని చెప్పటం కంటే దాచుకున్నాను అని చెప్పటం కరెక్ట్. కారణం ఏంటో తెలుసా? ఆ రోజు నా చేతిలో ఆ బొమ్మ చూసి మా నాన్న గారు ఆ కనుబొమ్మలు, కళ్లు, ముక్కు అచ్చం నీకు అలానే ఉన్నాయన్నారు' అని చెప్పిన విషయం తెలిసిందే. అప్పటి తన ఫొటోను కూడా చిరు పోస్ట్ చేశారు.
చిరు చేసిన పోస్ట్ అభిమానులను బాగా అలరించింది. దీనిపై ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మా ఇంట్లో హనుమంతుడిని ఆరాధించడమనేది మా సోదరుడు చిరంజీవిగారి వల్లే అలవాటైంది. ఇదే విషయం మా నాన్నను నాస్తిక, కమ్యూనిస్టు భావాల నుంచి రాముడి భక్తుడిగా మార్చింది. నా టీనేజ్‌లో ఉన్నప్పుడు నేను హనుమంతుడి చాలీసాను 108 సార్లు అప్పుడప్పుడు చదివేవాడిని. జై హనుమాన్' అని పవన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన పెద్దన్నయ్య చేసిన ఆ ట్వీట్‌ను పవన్ రీట్వీట్ చేశారు.