Varla Ramaiah: ఆ దళిత డాక్టర్ పై విధించిన సస్పెన్షన్ ను ఎత్తి వేయాలి: వర్ల రామయ్య డిమాండ్
- నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి డాక్టరును సస్పెండ్ చేయడం తగదు
- ప్రాణాలకు తెగించి వైద్య సేవలందిస్తున్నారు
- అటువంటి వారి శ్రమను కించపరచొద్దు
విశాఖ జిల్లాలోని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి డాక్టరు సుధాకర్ ను ఏపీ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ సస్పెండ్ చేయడంపై టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ఆ దళిత డాక్టర్ పై విధించిన సస్పెన్షన్ ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తున్న వారి శ్రమను కించపరచొద్దని, వైద్యులకు సరైన ఆయుధాలు ఇవ్వకుండా యుద్ధం చేయమంటారా? అని ప్రశ్నించారు. వైద్యులకు కావాల్సిన రక్షణ పరికరాలను అందించాలని కోరారు. ‘ఈనాటి దళిత వైద్యునితో మీ ఆట, భవిష్యత్ లో పులులతో వేటగా మారుతుంది’ అని ఘాటు విమర్శలు చేశారు.
లాక్ డౌన్ లో భాగంగా ప్రభుత్వ హాస్టల్లో వుండే లక్షలాది మంది పేద విద్యార్థులను ఇరవై రోజుల క్రితం వారి వారి ఇళ్లకు ప్రభుత్వం పంపిన విషయాన్ని గుర్తుచేస్తూ మరో ట్వీట్ చేశారు. ఆ పేద విద్యార్థుల ఆహారం గురించి విస్మరించడం శోచనీయమని, లక్షలాది మంది బడుగు వర్గాల బిడ్డలు తలిదండ్రులకు భారమైన స్థితిని గమనించి ఆదుకోవాలని సీఎం జగన్ కు ఓ సూచన చేశారు.