Muslim Youth: హిందూ మహిళ మరణిస్తే... పాడె మోసి మానవత్వం చాటుకున్న ముస్లిం సోదరులు!
- మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఘటన
- లాక్ డౌన్ కారణంగా రాలేకపోయిన బంధుమిత్రులు
- ముస్లింల సోదరభావంపై ప్రశంసల వర్షం
లాక్ డౌన్ నిబంధనలు అమలవుతున్న వేళ, ఓ హిందూ మహిళ మరణించగా, కరోనా భయంతో బంధువులు ఎవరూ అంత్యక్రియలకు హాజరు కాలేకపోగా, స్థానిక ముస్లిం సోదరులు పాడెమోసి, అంత్యక్రియలకు సహకరించి, తమలోని మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగింది. ఇందుకు సంబంధించిన చిత్రాలు, వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
లాక్ డౌన్ కారణంగా మరణించిన మహిళ బంధుమిత్రులు ఎవరూ అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. దీంతో చుట్టుపక్కల ఉన్న ముస్లిం యువకులు, మాస్క్ లు ధరించి, మృతురాలి కుమారులకు సహకరించారు. దాదాపు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్మశానానికి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఏ విధమైన వాహనమూ అందుబాటులో లేకపోవడంతో, తమ భుజాలపై పాడెను మోశారు.
దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 65 ఏళ్ల మహిళకు ఇద్దరు కుమారులు ఉండగా, వారిద్దరూ ఆమె మరణించిన తరువాత ఇంటికి చేరుకున్నారు. ఇక ముస్లింలు చూపిన మానవత్వంపై రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత కమల్ నాథ్ ప్రశంసలు కురిపించారు. వీరు సమాజానికి ఓ ఉదాహరణగా నిలిచారని కొనియాడారు. ఇటువంటి చర్యలు హిందూ, ముస్లింలలో సోదరభావాన్ని పెంచుతాయని అన్నారు. కాగా, తమకు ఆ మహిళ చిన్నప్పటి నుంచి తెలుసునని, ఆమె మరణిస్తే, అంత్యక్రియలకు సహకరించడం తమ విధిగా భావించామని ముస్లిం యువకులు వ్యాఖ్యానించారు.