Kerala: కరోనాను జయించిన కేరళ నర్సు రేష్మ!
- కేరళలో కరోనా సోకిన తొలి నర్సు రేష్మ
- వృద్ధ దంపతులకు చికిత్స చేయడంతో సోకిన వ్యాధి
- పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
కేరళలో కరోనా వైరస్ బారిన పడిన తొలి హెల్త్ వర్కర్ రేష్మ, ఇప్పుడు ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని, ఇంటికి చేరుకుంది. కొట్టాయం ప్రాంతానికి చెందిన వృద్ధ దంపతులు థామస్, మరియమ్మలకు కరోనా సోకగా, వారికి రేష్మ వైద్య చికిత్సల్లో సహకరించారు. ఈ నేపథ్యంలో ఆమెకూ వైరస్ పాజిటివ్ వచ్చింది. ఇటీవలే వృద్ధ దంపతులు కోలుకుని, ఇంటికి వెళ్లగా, తాజాగా, రేష్మ కూడా ఆరోగ్యవంతురాలై, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. ఈ సందర్భంగా తోటి నర్సులు ఆమెకు అభినందనలు తెలిపారు.
కాగా, 14 రోజుల క్వారంటైన్ ను పాటించిన తరువాత, రేష్మ తిరిగి తన విధులకు హాజరు కావచ్చని కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ వ్యాఖ్యానించారు. తేలికపాటి కరోనా లక్షణాలే రేష్మలో కనిపించాయని, దీని కారణంగానే ఆమె త్వరగా కోలుకుందని వైద్యులు వెల్లడించారు. ఇక, కరోనా చికిత్సకు తమ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలూ ఉన్నాయని, ప్రజల్లో భయాలు, ఆందోళన అవసరం లేదని రేష్మ వ్యాఖ్యానించారు. హాస్పిటల్ డాక్టర్లు, తోటి నర్సులతో పాటు భర్త, తల్లి ఇచ్చిన మనోధైర్యంతోనే తాను త్వరగా కోలుకున్నానని వెల్లడించారు.